: నోట్ల మాయాజాలం, సోషల్ మీడియాలో ఫిర్యాదు రావడమే ఆలస్యం... దూసుకొచ్చేస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు!

కర్ణాటకలో ఓ సీనియర్ మంత్రి వద్ద ఉన్న పాత కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు బెంగళూరు ఆర్బీఐ కార్యాలయంలోని ఓ మేనేజర్ స్థాయి అధికారి సహా, మరో ముగ్గురు సహకరించారు. ఈ విషయంలో సీబీఐ విచారణ జరిపించాలి. గత వారం రోజులుగా కన్నడ నాట సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో చక్కర్లు కొడుతున్న ఆన్ లైన్ పిటిషన్ ఇది. ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవిస్తూ, మొదలైన ఈ పిటిషన్ పాప్యులర్ అవుతుండటంతో సీబీఐ అధికారులు కదిలారు. ఆరోపణలు వచ్చిన మేనేజర్, ఓ ఐపీఎస్ అధికారి జీవిత భాగస్వామి కావడంతో కాస్తంత ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ, ఆమె ప్రమేయంపై పూర్తి సాక్ష్యాలు లభించినట్టు తెలుస్తోంది. మొత్తం రూ. 1.99 కోట్ల మొత్తాన్ని కొత్త రూ. 2 వేలు, రూ. 100 నోట్ల కింద మార్చినట్టు సమాచారం. ఈ ఒక్కటే కాదు. ఇదే తరహాలో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి.

బ్యాంకు అధికారుల హస్తమున్న నోట్ల రద్దు, వాటి మార్పిడి లావాదేవీల గురించి వందల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఫిర్యాదుల్లో ఏ మాత్రం అనుమానం వచ్చినా వాటిని సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సిఫార్సు చేస్తున్నారు. ఒక్క కర్ణాటకలో వచ్చిన ఫిర్యాదుల నుంచి 40 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉద్యోగులపై సీబీఐ దృష్టిని సారించినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు రావడమే ఆలస్యం, వారి కదలికలను నిశితంగా గమనిస్తున్న సీబీఐ అధికారులు, బ్యాంకులో వారి చర్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లను సేకరించి, వారు ఎవరితో ఫోన్ సంభాషణలు జరిపారన్న విషయాలపై విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News