: పాకిస్థాన్ కు మరింత దగ్గరవుతున్న రష్యా... ఆందోళనలో ఇండియా!

తన స్వప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పాకిస్థాన్, చైనాలు సంయుక్తంగా చేపట్టిన సీపీఈసీ (చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్)కి బహిరంగ మద్దతు ప్రకటించిన రష్యా చర్య ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదానికి మద్దతిస్తూ, ఇండియాపై దాడులు చేయిస్తున్న పాక్ ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తున్న వేళ, రష్యా చర్యలు భారత పాలకులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. చైనా నిధులతో తయారైన సీపీఈసీని వాడుకుంటూ, తాము తలపెట్టిన ఈఈయూ (యూరేసియన్ ఎకనామిక్ యూనియన్) ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్నది రష్యా అభిమతంగా తెలుస్తోంది.

పాకిస్థాన్ లో భాగంగా ఉన్న బెలూచిస్తాన్ ప్రావిన్స్ లోని గ్వదార్ కు రాకపోకలను సుగమం చేసిన సీపీఈసీని వినియోగించుకుంటే, తాము లాభపడవచ్చని రష్యా గట్టిగా నమ్ముతోంది. ఇక పాక్ తో బంధాన్ని బలపరచుకుంటున్న రష్యా నేతలు, ఇండియాలో పర్యటించిన వేళ మాత్రం, తమకు అటువంటి ఉద్దేశాలు లేవని చెబుతూనే, బయటకు వెళ్లి, పాక్ కు మద్దతు తెలుపుతూ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. తాము తలపెట్టిన ఈఈయూ ప్రాజెక్టులో సీపీఈసీని విలీనం చేయాలని చైనా, పాక్ లను కోరినట్టు పాకిస్థాన్ లో రష్యా దౌత్యాధికారి అలెక్సీ వై డెడోవ్ వెల్లడించారు.

అయితే, జరుగుతున్న ఈ పరిణామాలు ఇండియాకు నష్టం కలిగించేవేమీ కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను నాశనం చేసేందుకు తాలిబాన్లకు దగ్గర కావాలని రష్యా భావిస్తోందని సదరు అధికారి వ్యాఖ్యానించారు. రష్యా వైఖరిని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపారు. కాగా, గత అక్టోబర్ లో గోవాలో బ్రిక్స్ సమావేశాల్లో సైతం లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల పేర్లను డిక్లరేషన్ లో ప్రస్తావించి, పాక్ ను ఎండగట్టేందుకు అటు చైనా, ఇటు రష్యా అంగీకరించలేదన్న సంగతి తెలిసిందే.

More Telugu News