jayalalitha: జయలలిత మహాసమాధి వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మహాసమాధి వద్దకు ఆమె అభిమానులు ఇప్ప‌టికీ భారీ సంఖ్య‌లోనే చేరుకుంటున్నారు. చెన్న‌య్‌లోని మెరీనా తీరంలో ఆమె స‌మాధి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆమె అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌రువాత‌ అక్క‌డ‌కు భారీగా వ‌చ్చిన అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు, జ‌య‌ల‌లిత అభిమానులు ఇటీవ‌లే అక్క‌డే తలనీలాలు సమర్పిస్తూ క‌నిపించారు. జ‌య‌ల‌లిత చ‌నిపోయి ఇన్ని రోజుల‌యినప్ప‌టికీ కూడా అక్క‌డికి ఆమె అభిమానుల తాకిడి త‌గ్గ‌డం లేదు. జయలలిత మహాసమాధిని చూస్తూ వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంజీఆర్‌ స్మారక మండపం ప్రాంగణంలోనే జయలలిత మహాసమాధి ఉండటం కూడా అభిమానుల ర‌ద్దీకి మ‌రో కారణం.

నిన్న ఆమె అభిమానుల‌తో పాటు బుల్లితెర కళాకారులు పలువురు గాంధీ విగ్రహం నుంచి జయలలిత స్మారకం వరకు ర్యాలీగా వచ్చి మహాసమాధి వద్ద  నివాళుల‌ర్పించారు. నిన్న సాయంత్రం తమిళనాడు సంగీత విశ్వవిద్యాలయం ఉపకులపతి వీణా గాయత్రి ఆధ్వర్యంలో జ‌య‌ల‌లిత‌కు నివాళిగా సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అమ్మ సమాధి వ‌ద్ద‌కు వ‌స్తోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేద‌ని అక్క‌డి అధికారులు చెబుతున్నారు.

More Telugu News