: అమెజాన్ .. ఫ్లిప్ కార్ట్ మధ్య 'వన్ ప్లస్ 3' స్మార్ట్ ఫోన్ ధరల యుద్ధం: ఇదెక్కడి గోలంటున్న 'వన్ ప్లస్' సంస్థ!

ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల మధ్య కొత్త వివాదం నెలకొంది. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ను తెరచిన వారికి, వన్ ప్లస్ 3 స్మార్ట్ ఫోన్ అమ్మకాలను బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో భాగంగా అందించనున్నామని, దీని ధర రూ. 19,999 గా ఉంటుందని ప్రకటించింది. ఈ యాడ్ సంచలనం కలిగించగా, తాము ఫ్లిప్ కార్ట్ తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, ఇదెక్కడి గోలని వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించారు. ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ను ట్యాగ్ చేస్తూ, "బ్రదర్, వాట్ ఈజ్ దిస్?" అని ప్రశ్నించారు. తాము వన్ ప్లస్ 3 అమ్మకాల కోసం అమెజాన్ తో ప్రత్యేక డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపారు.

ఈ ట్వీట్ పై సచిన్ బన్సాల్ స్పందించలేదు. అయితే, ఫ్లిప కార్ట్ మాత్రం ఓ ప్రకటన వెలువరుస్తూ, "దేశవ్యాప్తంగా ఏ అమ్మకందారుడైనా మా వెబ్ సైట్లో అతని ప్రొడక్టులను విక్రయించుకోవచ్చు. అయితే, వారు కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్లు, వాటి ధరలు అమ్మకందారుల ఇష్టానుసారమే ఉంటాయి" అని పేర్కొనడం గమనార్హం.

వాస్తవానికి అమెజాన్ లో వన్ ప్లస్ 3 ధరను రూ. 27,999గా నిర్ణయించారు. ఇదే సమయంలో ఈ ఫోన్ ను రూ. 20 వేల కన్నా తక్కువకు అందిస్తామని ఫ్లిప్ కార్ట్ లో ప్రకటన రావడాన్ని అటు వన్ ప్లస్, ఇటు అమెజాన్ తప్పుబట్టాయి. తాము ప్రత్యేకంగా అమెజాన్ తో డీల్ కుదుర్చుకుని ఈ ఫోన్ విక్రయిస్తున్నామని, అనధికారికంగా జరిగే లావాదేవీల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని, కస్టమర్లు మోసపోవద్దని కార్ల్ పెయ్ కోరారు.

More Telugu News