: కేరళలో దారుణ ర్యాగింగ్... సీనియర్ల దాష్టీకానికి జూనియర్ కిడ్నీలు ఫెయిల్

కేరళలోని త్రిసూర్ కు చెందిన ఓ పాలిటెక్నిక్ కళాశాలలో సీనియర్లు జరిపిన ర్యాగింగ్ కు ఓ విద్యార్థి కిడ్నీలు చెడిపోయి, డయాలసిస్ చేయించుకునే స్థితికి చేరుకోగా, పలువురు జూనియర్ విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. మొత్తం 9 మంది జూనియర్లను ఈ నెల 2వ తేదీ రాత్రి దాదాపు 5 గంటల పాటు సీనియర్లు ర్యాగింగ్ చేసినట్టు కళాశాల విద్యార్థి అవినాష్ వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొమ్మిది మంది సీనియర్లపై కేసులు పెట్టి, వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ర్యాగింగ్ లో భాగంగా, వీరి దుస్తులను విప్పించిన సీనియర్లు, నేలపైనే సోమర్ సాల్ట్స్ వేయించడం, స్విమ్మింగ్ చేయించడం వంటి శిక్షలు వేశారు. తాము అలసిపోయామని చెబుతున్నా వినకుండా గంటల తరబడి వారిని హింసించారు. రాత్రి మొదలైన ర్యాగింగ్ ఐదు గంటల పాటు సాగింది. దీంతో అవినాష్ అనే విద్యార్థి కిడ్నీలు పాడైపోయాయి. అతని శరీరంలో మయోగ్లోబిన్ అధికంగా విడుదలై, కిడ్నీల పనితీరును దెబ్బతీసిందని డాక్టర్లు వెల్లడించారు. నిందితుల్లో నలుగురు పారిపోయారని, వీరిని అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News