: రెండు రోజుల్లో రూ.70 కోట్లు డిపాజిట్ చేసిన బంగారం వర్తకుడు.. బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన ఈడీ అధికారులు

పెద్దనోట్ల రద్దు తర్వాత నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు నల్లబాబులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లధనాన్ని బంగారం కొనుగోళ్లకు మళ్లించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించింది. ముంబైలో ఓ బులియన్ వ్యాపారికి చెందిన రెండు బ్యాంకు అకౌంట్లను తనిఖీ చేసిన ఈడీ ఈ విషయాన్ని నిర్ధారించింది. గత నెల 8న అర్ధరాత్రి నుంచి పెద్దనోట్లు రద్దుకాగా 10, 11 తేదీల్లో ఆ వ్యాపారి ఖాతాల్లో రూ.70 కోట్ల నగదు జమ అయినట్టు అధికారులు గుర్తించారు. నల్లడబ్బును తెల్లగా మార్చే క్రమంలోనే ఈ లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తున్నారు. పెద్ద ఎత్తున బంగారం విక్రయాలు జరపడం ద్వారా వచ్చిన సొమ్మును బ్యాంకులో జమ చేసి ఉంటారని, ఆ తర్వాత ఈ మొత్తాన్ని షెల్ కంపెనీలకు మళ్లించారని అధికారులు భావిస్తున్నారు.

వర్తకుడి ఖాతాలను ఫ్రీజ్ చేసే సమయానికి ఆయన ఖాతాల్లో రూ.1.4 కోట్లు మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రూ.18 లక్షల కొత్త నోట్లను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇండో-నేపాల్ సరిహద్దులోని గౌరిఫాంటాలో రూ.6 లక్షల విలువైన నేపాల్ కరెన్సీ, రూ.58 వేల విలువైన రూ.2వేల కొత్తనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు సూరత్‌లోని వడ్డీ వ్యాపారి భజియావాలా ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో రూ.10.50 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మూడు దశాబ్దాల క్రితం చాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించిన భజియావాలా నేడు రూ.కోట్లకు పడగలెత్తడం గమనార్హం. యూపీలోని నోయిడాలో ఐటీ అధికారులకు వింతైన అనుభవం ఎదురైంది. అక్కడి యాక్సిస్ బ్యాంకులో 20 షెల్ కంపెనీలకు చెందిన ఖాతాల్లో రూ.60 కోట్లను గుర్తించారు. అయితే ఆ ఖాతాదారులను సంప్రదించగా వాటితో తమకు సంబంధం లేదని, ఎవరో తమ పేరుతో ఖాతాలు తెరిచి డబ్బులు జమ చేశారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News