internet ban: మణిపూర్‌లో మత ఉద్రిక్తతలు... మొబైల్‌ ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాపై నిషేధం!

మ‌ణిపూర్‌లో మ‌రోసారి మత ఉద్రిక్తతలు తీవ్ర‌స్థాయిలో చెల‌రేగాయి. ఆ రాష్ట్ర‌ రాజధాని ఇంఫాల్‌లోని మణిపూర్‌ బాప్టిస్టు కన్వెన్షన్ సెంటర్‌ చర్చి, తాంగ్‌ఖుల్‌ చర్చిపై కొంద‌రు రాళ్లు విసిరారు. దీంతో తీవ్ర అల‌జ‌డి చెల‌రేగుతోంది. ఆయా చర్చిలపై జ‌రిగిన ఈ దాడుల నేప‌థ్యంలో ఎన్నో వ‌దంతులు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో అల్ల‌ర్లు మ‌రింత చెల‌రేగే ప్ర‌మాదం ఉండ‌డంతో అధికారులు ఆ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. వదంతులను నివారించ‌డానికి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా వెబ్‌సైట్లను బ్యాన్ చేశారు. ఆ రాష్ట్రంలో పలు జిల్లాల వాసులు నాగాల పూర్వీకుల భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నారని నాగా గిరిజన గ్రూపులు నిర‌స‌న‌ల‌కు దిగ‌డంతో ఆ రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం నెలకొంది.

ఆ రాష్ట్రంలోకి నిత్యావసరాలు సరఫరా అయ్యే ప్రధాన రహదారిలోనూ గిరిజనులు ఆందోళ‌న నిర్వ‌హిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు నిత్యావసరాలు,  ఔషధాలు దొర‌క్క తీవ్ర క‌ష్టాలు పడుతున్నారు. అంతేగాక‌, నాగా ఉగ్రవాదుల దాడులతో మ‌ణిపూర్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నాగా వర్గం ప్రజలు సందర్శించే చర్చిలపై దాడులు జ‌ర‌గ‌డం అల‌జ‌డి రేపింది.

More Telugu News