: బంగారం జోలికొచ్చారో ఖబడ్దార్.. మరో ఉద్యమానికి సిద్ధమవుతా: కేంద్రానికి కేసీఆర్ హెచ్చరిక

పెద్దనోట్ల రద్దు వల్ల దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతు ఇస్తున్నామని, కానీ బంగారం జోలికి వస్తే మాత్రం సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. అదే జరిగితే తెలంగాణ ఉద్యమం వంటి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతానని తేల్చి చెప్పారు. ‘పెద్దనోట్ల రద్దు-రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ-ప్రజలపై ప్రభావం’ అంశంపై శనివారం శాసన మండలిలో జరిగిన చర్చలో కేసీఆర్ పైవిధంగా వ్యాఖ్యానించారు.

నల్లధనంపై పోరు మొదలుపెట్టిన మోదీ చర్యలు ఇక్కడితో ఆగవని, నల్లధనం ఏ రూపంలో ఉన్నా కక్కించేందుకు ఆయన మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఒక్కరూపాయి కూడా అప్పు ఇచ్చేవాడు కానీ, తీసుకునేవాడు కానీ ఉండడని అన్నారు. అందరూ నగదు రహిత లావాదేవీలకే మొగ్గుచూపుతారని అన్నారు. తాను ప్రధానిని కలిసినప్పుడు ‘నీ వద్ద ఎంత బంగారం ఉంది?’ అని ప్రధాని తనను అడిగారని, దానికి తాను 115 తులాలు అని చెప్పానని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1985లోనే ఆస్తులు ప్రకటించానని పేర్కొన్నారు. అప్పుడే ఈ విషయాన్ని కూడా చెప్పానని తెలిపారు.

కేంద్రం త్వరలో ‘గోల్డ్ డిక్లరేషన్’ చేయాలని ప్రజలను కోరే అవకాశం ఉందన్నారు. అయితే కిలో వరకు ఉన్న ఆభరణాల జోలికి ప్రభుత్వం రాదని అన్నారు. బిస్కెట్ల రూపంలో, కడ్డీల రూపంలో ఉన్న వాళ్ల నుంచే ప్రభుత్వం లాక్కుంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఓ వ్యాపారి ఒక్క రాత్రే 3600 మందికి బంగారం అమ్మినట్టు కేసు నమోదైందని, అటువంటి వారు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. బంగారం తర్వాత బినామీ ఆస్తులపై కేంద్రం పడుతుందని, తమకున్నషేర్లను కూడా వెల్లడించాల్సి ఉంటుందని కేసీఆర్ తెలిపారు. డాలర్లు, విదేశీ కరెన్సీపై కేంద్రం దృష్టి సారించడంతో మనీలాండరింగ్ వంటి మోసాలు తగ్గిపోతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 
 

More Telugu News