: బ్రెజిల్ వైద్యుల వినూత్న చికిత్స విధానం .. కాలిన గాయాలకు చేప చర్మంతో బ్యాండేజ్!

కాలినగాయాలకు బ్రెజిల్ వైద్యులు వినూత్న చికిత్సను అందిస్తున్నారు. ఈ గాయాలకు  చేప చర్మాన్ని బ్యాండేజ్ గా వేసి సత్ఫలితాలను సాధిస్తున్నారు. అందుకు, సుమారు ఇరవై రోజుల క్రితం బ్రెజిల్ లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. రూసాస్ నగరంలోని కాసా వెల్హా అనే రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో వెయిటర్ గా పనిచేస్తున్న మారియా క్యాండిడో డా సిల్వా అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె ఎడమచేతికి, గొంతుకు, ముఖంలో కొంత భాగానికి సెకండ్ డిగ్రీ గాయాలు అయ్యాయి. కాలిన గాయాల మంటను తట్టుకోలేకపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బాధను తట్టుకోలేకపోతున్నానని..ఏదో ఒకటి చేయమంటూ అక్కడి వైద్యులను ప్రాధేయపడింది. చేప చర్మం బ్యాండేజ్ ను వేస్తే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెప్పడంతో అందుకు ఆమె అంగీకరించింది. ఆ బ్యాండేజ్ వేసిన కొద్ది సేపటి తర్వాత ఆమెకు మంట తగ్గిపోయింది. ఆ తర్వాత రెండు, మూడు రోజులకొకసారి వెళ్లి ఆ బ్యాండేజ్ ను ఆమె మార్చుకునేది. ప్రస్తుతం పూర్తిగా గాయాలు నయమైనట్లు ఆమె చెప్పింది.

 ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ,  ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మంచినీటిలో పెరిగిన చేపల చర్మాన్నే కాలిన గాయాలకు బ్యాండేజ్ గా వేయాలని, ఆ నీటిలో పెరిగిన చేపల చర్మంలో ఇన్ ఫెక్షన్ ను తట్టుకునే గుణంతో పాటు, తేమ ఎక్కువ సేపు ఉంటుందని, దానివల్ల మంట తగ్గుతుందని వైద్యులు పేర్కొన్నారు. చేపలను వినియోగించే ప్రజలు వాటి చర్మాన్ని చెత్తలో పారేయకుండా, ఆసుపత్రులకు విరాళంగా అందజేస్తే కాలిన గాయాలకు ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు.
 

More Telugu News