: మేము పోడియం దగ్గర లేకపోయినా సస్పెండ్ చేశారు: రేవంత్ రెడ్డి

తమ అవినీతిని, తమ తప్పుడు నిర్ణయాలను విపక్షాలు ప్రశ్నిస్తాయని ప్రభుత్వాలు భావించినప్పుడు... విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంలాంటి నిర్ణయాలు తీసుకుంటాయని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ కల్పించుకుని, సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా, ప్రభుత్వానికి అందరూ సూచనలు ఇచ్చేలా వ్యవహరించాలని... కానీ, దురదృష్టవశాత్తు స్పీకర్ అలా చేయకుండా, తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభలో కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే ఉన్నాయన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని... ఆ రెండు పార్టీల నేతలు మాత్రమే సభలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కీలక అంశాలపై మాట్లాడే అవకాశాన్ని అన్ని పార్టీలకు ఇవ్వాలని... కానీ, అలా జరగడం లేదని విమర్శించారు. లగడపాటి రాజగోపాల్, ఛత్తీస్ గఢ్ విద్యుత్ కంపెనీలతో అక్రమ ఒప్పందాలను కుదుర్చుకున్నారని... వీటి బండారం బయటపడుతుందనే తమను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని రేవంత్ అన్నారు. వీటిపై తాము మాట్లాడతామనే తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తాము పోడియం వద్దకు వెళ్లకున్నా తమపై వేటు వేశారని మండిపడ్డారు. అయితే, స్పీకర్ తమను కాపాడతారని భావించామని... కానీ, ఆయన కూడా ప్రభుత్వానికే వత్తాసు పలికారని... ఇది తమను చాలా బాధిస్తోందని అన్నారు.

More Telugu News