demonitization: వారి బ్యాంకు ఖాతాలను ఆపరేట్‌ చేయకండి.. మరిన్ని ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ

పంజాబ్‌లో సోదాలు నిర్వహిస్తోన్న ఈడీ అధికారులు అక్కడి ఓ బ్యాంకులో జరిగిన అక్రమలావాదేవీలను గుర్తించి, ఒక వ్యాపారికి ఏకంగా 85 బ్యాంకు ఖాతాలు తెర‌చాడ‌ని నిర్ధారించుకున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్‌బీఐ అక్ర‌మ లావాదేవీల‌పై మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌యిన బ్యాంకులకు ప‌లు ఆదేశాలు జారీ చేసింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు చేసిన రోజు నుంచి పాన్ నెంబ‌రు ఇవ్వ‌కుండా ఈ నెల 30 వ‌ర‌కు 50,000 రూపాయ‌ల క‌న్నా త‌క్కువ న‌గ‌దును ప‌లుసార్లు జ‌మ‌చేసుకొని, మొత్తం రూ.2.5 లక్షలు, అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేసుకున్న వారి వివ‌రాల‌ను బ్యాంకు అధికారులు త‌మ‌కు ఇవ్వాల‌ని ఇప్ప‌టికే కోరిన ఆర్‌బీఐ, వాటికి మ‌రిన్ని అంశాల‌ను జోడించింది.  నవంబర్ 9  అనంత‌రం రూ. 2 లక్షలకు పైగా డిపాజిట్‌ చేసిన ఖాతాలను పాన్‌తో అనుసంధానం చేయాలని అది కుద‌ర‌క‌పోతే ఫారం-60ని నింపాల‌ని ఖాతాదారుల‌కు సూచించాల‌ని బ్యాంకుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఖాతాదారులు ఈ ప‌ని చేసేవ‌ర‌కు బ్యాంక‌ర్లు వారి ఖాతాలను ఆపరేట్‌ చేయకూడదని ఆదేశించింది. వాటితో పాటు న‌వంబ‌రు 9కి ముందు చేసిన డిపాజిట్ల‌తో స‌హా ఐదు లక్షల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్న ఖాతాదారుల పాన్‌ను కూడా తప్పనిసరిగా అనుసంధానం చేయాలని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు చేసింది. లేదంటే ఖాతాదారులు ఫారం 60ని నింపి బ్యాంకులో సమర్పించాలని చెప్పింది. ఆదేశాలు పాటించని వారి ఖాతాల‌ను ఆపరేట్‌ చేయకూడదని చెప్పింది.

More Telugu News