: రోహిత్ వేముల ఆత్మహత్యపై బీజేపీని నిలదీసిన పవన్ కల్యాణ్!

నిన్న గోవధ, గోసంరక్షణపై బీజేపీని తీవ్ర స్థాయిలో నిలదీసిన సీని నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నేడు రోహిత్ వేముల మృతిపై నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ వ్యవహార శైలిని తూర్పారపట్టారు. దేశంలో కొన్ని లక్షల మందిలా రోహిత్ వేముల కూడా బీజేపీని వ్యతిరేకించాడు లేదా ద్వేషించాడు. అంత మాత్రాన వేధింపులకు దిగుతారా? వ్యతిరేకించడం అంటే వేధింపులకు లైసెన్స్ ఇచ్చినట్టా? అని ఆయన ప్రశ్నించారు. తమను వ్యతిరేకించే వారిపై వేధింపులకు దిగడం సరైన విధానం కాదని దేశంలోని పార్టీలన్నీ గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల్లో అభిప్రాయభేదాలు ఉండడం సర్వసాధారణమని పవన్ కల్యాణ్ తెలిపారు. ఒక వ్యక్తి తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంటే, అతనికి సరైన విధానంలో కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి, అతనిని లక్ష్యం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు.

యూనివర్సిటీ నిబంధనలకు లోబడి పరిష్కారాలు కనుగొనాలి తప్ప వేధింపులకు దిగడం, కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడం హర్షణీయం కాదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ ఈ ఘటనలో కేంద్రం నేరుగా జోక్యం చేసుకుందని ఆయన ఆరోపించారు. దీనికి తోడు యూనివర్సిటీ సస్పెన్షన్ వేటు వేయడం, అంతటితో ఆగకుండా యూనివర్సిటీ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడం, ఈ క్రమంలో అతను ఎవరి గ్రూపులో ఉన్నాడో ఆ గ్రూపు నుంచి అవసరమైన సహకారం అందకపోవడం కూడా అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించాయని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ వేముల ఆగ్రహం, నిరాశానిస్పృహలకు దారితీసిందని, ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తికి సరైన కౌన్సిలింగ్ అవసరమని, అది రోహిత్ వేములకు అందలేదని ఆయన చెప్పారు.

 ఈ ఘటనలో అన్నింటికంటే బాధాకరమైన అంశమేంటంటే... రోహిత్ వేముల ఆత్మహత్యను బీజేపీయేతర రాజకీయ పార్టీలు వాటి స్వలాభానికి వాడుకోవాలని చూస్తే... బీజేపీ దాని మిత్రపక్షాలు రోహిత్ వేముల దళితుడు కాదు అని నిరూపించడంలో బిజీగా మారిపోయాయని మండపడ్డారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం వీరికి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మన యూనివర్సిటీలు విద్యాలయాలుగా కంటే రాజకీయపార్టీల బలం నిరూపించుకునే మైదానాలుగా మారిపోవడం బాధాకరమని పవన్ కల్యాణ్ ఘాటుగా విమర్శించారు. 

More Telugu News