: మరణించాడని డాక్టర్లు నిర్ధారిస్తే...మార్చురీలో శ్వాస తీసుకుంటూ కనిపించాడు!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రిలో చేరిస్తే వైద్యులు మరణించాడని చెప్పారు. దీంతో మార్చురీలో వదిలి వెళ్తే... సదరు వ్యక్తి శ్వాస తీసుకుంటూ కనిపించిన ఆశ్చర్యకరమైన ఘటన సౌతాఫ్రికాలో చోటుచేసుకుంది. జొహెన్నెస్ బర్గ్ కు దగ్గర్లోని డర్బన్ ప్రాంతంలోని క్విమషూకి చెందిన మిసింజీ ఎంఖైజే (28) రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా అదుపుతప్పిన ఓ కారు అతనిని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటీన స్పందించిన స్థానికులు కుటుంబానికి సమాచారమిచ్చి, ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించాడని వారికి తెలిపారు.

దీంతో వారు అతనిని మార్చురీలో భద్రపరిచి కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత పోస్టుమార్టం చేయాలని సూచించి వెళ్లిపోయారు. మరుసటి రోజు అక్కడికి చేరుకున్న అతని కుటుంబ సభ్యులు మార్చురీలో ఉన్న ఎంఖైజే భౌతిక కాయాన్ని చూడగా, గడ్డకట్టే చలిలో శ్వాసతీసుకుంటూ కనిపించాడు. దీంతో వెంటనే వైద్యులకు సమాచారం అందించగా, ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స ఇచ్చారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆ తర్వాత మరణించాడు. దీనిపై ఎంఖైజే కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తన కుమారుడు మరణించాడని నిర్ధారించిన వైద్యులను చూడాలని ఉందని బాధితుడి తండ్రి తెలిపారు. వారి నిర్లక్ష్యం కారణంగా రాత్రంతా గడ్డకట్టే చలిలో తన కుమారుడు ఉండాల్సి వచ్చిందని, దీంతోనే చనిపోయాడని ఆయన పేర్కొన్నారు. 

More Telugu News