: మూడు తరాల బంధానికి చెక్ పెట్టిన కాంగ్రెస్.. మాజీ మంత్రి ‘కాసు’పై వేటు

‘కాసు’ కుటుంబంతో ఉన్న మూడు తరాల అనుబంధానికి కాంగ్రెస్ చెక్ చెప్పింది. ఎవరూ ఊహించని రీతిలో మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిపై వేటేసింది. క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా ఉన్న కాసును ఆ పదవి నుంచి తప్పిస్తూ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో జేడీ శీలంను నియమించారు. కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డి నేడు నరసరావుపేటలో జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న నేపథ్యంలో ఈ వేటు వేసినట్టు తెలుస్తోంది.

 మరోవైపు తన కుమారుడు వైసీపీలో చేరినా తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కాసు కృష్ణారెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు కూడా. అయినా పీసీపీ వేటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా మహేశ్‌రెడ్డి వైసీపీలో చేరనుండడంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది. కాంగ్రెస్ నుంచి వలసలను అడ్డుకోవడంలో కృష్ణారెడ్డి విఫలమయ్యారని భావించే పీసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి కృష్ణారెడ్డి రెండుసార్లు ఎంపీగా, అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా కాసు కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసింది.

More Telugu News