: రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై ప్రశ్నించడానికి పవన్ కల్యాణ్ సిద్ధం.. ఆయన వ్యూహం ఏమిటి?

హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో దళిత పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మధ్య తీవ్రవాగ్వాదం, ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతిని రాష్ట్రమంతా గమనించింది. రోహిత్ వేములను మతోన్మాదశక్తులు బలితీసుకున్నాయని దళిత విద్యార్థి సంఘాలు ఆరోపించగా, రోహిత్ వేముల అసలు దళితుడే కాదంటూ మరో వివాదం తెరపైకి వచ్చింది. అనంతరం ఏర్పాటు చేసిన కమిటీలు, చేసిన దర్యాప్తుల్లో కొన్ని రోహిత్ వేముల దళితుడు కాదని, మరికొన్ని దళితుడేనంటూ సర్టిఫికేట్ ఇచ్చాయి. అదే సమయంలో తన కుమారుడు దళితుడు కాదని పేర్కొంటూ, రోహిత్ వేముల తండ్రి తెరపైకి రావడం, కాదు దళితుడేనంటూ అతని తల్లి పోరాటానికి దిగడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ అంశంపై జనసేనాని, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రశ్నాస్త్రాలు సంధించడానికి సిద్ధమవుతున్నారు. ఇది చాలామందిలో ఆసక్తి రేపుతుండగా, బీజేపీని మాత్రం ఇరకాటంలో పెడుతోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 'కాంగ్రెస్ హఠావ్.. దేశ్ బచావ్' నినాదంతో బీజేపీకి పూర్తి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్, ఇప్పుడిలా పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగడం, అదీ నోట్ల రద్దుతో ప్రజలంతా బీజేపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నవేళ ఆయన ట్వీట్లతో బీజేపీని ప్రశ్నించడం ఆ పార్టీకి మింగుడుపడడంలేదు.

More Telugu News