: ఆయా దేశాల్లో ఇప్పటివరకు 50 వేల మంది ఉగ్రవాదులను హతమార్చాం!: అమెరికా సైన్యం

ఇరాక్, సిరియా దేశాల్లోని ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చేందుకు మూడేళ్లుగా అమెరికా సైన్యం దాడులు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. తాము జ‌రుపుతున్న దాడుల ఫ‌లితంగా హ‌త‌మైన ఉగ్ర‌వాదుల గురించి అమెరికా సైనిక వ‌ర్గాలు ప్ర‌క‌ట‌న చేశాయి. ఇప్పటి వరకు ఆ రెండు దేశాల్లో ఉన్న ఉగ్ర‌వాదుల్లో తాము 75 శాతం మందిని వైమానిక దాడుల్లో మ‌ట్టుబెట్టామ‌ని చెప్పారు. తాము ఈ దాడుల‌ను 2014లో ప్రారంభించామ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50 వేల మందిని హ‌త‌మార్చార‌ని పేర్కొన్నాయి. తాము హ‌త‌మార్చిన వారిలో 12 వేల నుంచి 15వేల మంది వరకు శిక్షణ పొందిన ఉగ్ర‌వాద‌ నాయకులు కూడా ఉన్నారని తెలిపారు. త‌మ దేశం ఆయా దేశాల్లో చేప‌డుతున్న దాడుల‌పై అమెరికా అద్య‌క్షుడు బరాక్‌ ఒబామా తాజాగా త‌న‌ కార్యాలయంలో స‌మీక్షించారు.
 
ఉగ్ర‌వాదుల‌పై జ‌రుపుతున్న‌ దాడుల్లో సహకరిస్తున్న సంకీర్ణ దేశాలకు ప్రత్యేక దౌత్యవేత్తగా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ బ్రెట్‌ మ్యాక్‌గుర్క్‌ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆ రెండు దేశాల్లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై 2014 నుంచి ఇప్పటి వరకు 17 వేల వైమానిక దాడులు నిర్వహించినట్లు, ఈ దాడుల్లో అధిక‌ దాడులను అమెరికా సైనికులే జరిపినట్టు, సంకీర్ణ ద‌ళాలు 4,500 దాడులను మాత్రమే జ‌రిపినట్టు చెప్పారు. ఈ దాడుల్లో కీల‌క‌ ఉగ్ర‌వాద నాయ‌కులు కూడా హ‌త‌మ‌య్యార‌ని, ఉగ్ర‌వాదుల‌కు భారీగా న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు. విదేశాల నుంచి ఉగ్ర‌వాదులు రాకుండా సరిహద్దుల్లో అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం కూడా ఇరాక్, సిరియా దేశాల్లో సైన్యం నిర్వ‌హిస్తోన్న దాడుల‌కు లాభ‌ప‌డింద‌ని ఆయ‌న చెప్పారు.

ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో తిష్ట‌వేసి కూర్చున్న ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదుల‌కు, అమెరికా సైనికులకు మధ్య  దాడులు జ‌రుగుతున్నాయ‌ని, మ‌రోవైపు గతేడాది పారిస్, బ్రస్సెల్స్‌లలో జ‌రిగిన‌ ఘోర‌ దాడులకు సూత్రధారులైన ఉగ్ర‌వాద‌ నాయకులు రక్కాలో హ‌త‌మయ్యార‌ని చెప్పారు. మొత్తం 75 శాతం ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌ని, మిగతా 25 శాతం ఉగ్ర‌వాదులను హ‌త‌మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, వ‌చ్చేనెలలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌దే ఆ బాధ్య‌త అని అన్నారు.

More Telugu News