: నాన్నా! స్వర్గంలో ఆనందంగా ఉన్నావా?...ఒక్క ఉత్తరం రాయవా?: గుండెల్ని పిండేసే బాలుడి లేఖ

మరణించిన తండ్రికి ఓ బాలుడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ గుండెల్ని పిండుతోంది. వివరాల్లోకి వెళ్తే... స్కాట్ లాండ్ లోని డన్ ఫెర్మ్ లైన్ లోని స్టేడియంలో స్టూవర్ట్ మెక్ కోల్ (30) అనే ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుండగా, నీలం రంగు బెలూన్ ఒకటి కిందపడింది. దానిని చూసిన ఫోటోగ్రాఫర్ కి, ఆ బెలూన్ కి కట్టి ఉన్న ఓ కాగితం కూడా కనిపించింది.  ఆత్రుతతో అది విప్పి చూడగా, అందులో 'హాయ్ డాడ్..' అన్న పెద్ద అక్షరాలు కనిపించాయి. దీంతో దానిని ఆసక్తిగా చదివాడు.

'హాయ్ డాడ్... నేను నిన్ను మిస్ అవుతున్నానని చెప్పేందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. నీకు తెలుసు, నేను అమ్మ సంరక్షణలో ఉన్నానని. అయితే, అమ్మ ఆరోగ్యం బాగాలేదు. అనారోగ్యంతో బాధపడుతోంది. నా చెవి మూసుకుపోయింది. నేను నీతో పాటు, స్కూలును కూడా మిస్ అవుతున్నాను. నువ్వు స్వర్గంలో ఉన్నావని నాకు తెలుసు డాడ్...అక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావా? నువ్వు రాసిన లేఖ నా దిండుకింద పెడతావని నా ఆశ. క్రిస్మస్ కు నాకు కావాల్సిన వస్తువుల జాబితా ఇదిగో...బూట్లు, బేస్ బాల్ కిట్, రిబౌండర్ నెట్, కొత్త ప్రీమియర్ లీగ్ బాల్, షార్ట్స్, రూబిక్స్ క్యూబ్, బై డాడ్... ఐ లవ్ యూ' అంటూ ముగించాడు.

ఈ ఉత్తరాన్ని చదివిన ఫోటోగ్రాఫర్ స్టువర్ట్ మనసు చేమ్మగిల్లింది. ఉద్వేగంతో ఏడ్చేశానని చెప్పాడు. ఈ ఉత్తరాన్ని ఆ బాలుడు డిసెంబర్ 1న రాశాడని, దీనిని జాగ్రత్త చేయాలనిపించి సోషల్ మీడియాలో పోస్టు చేశానని స్టువర్ట్ తెలిపాడు. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం క్రిస్మస్ లోపు ఆ బాలుడ్ని వెతికి పట్టుకుని, అతను కోరుకున్న వస్తువులు అందజేయడమేనని స్టువర్ట్ తెలిపాడు.

కాగా, పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ పండుగతో ముడిపడి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. శాంటా క్లజ్ కోరికలు తీరుస్తాడని చెబుతారు. ఇంచు మించు ప్రతి చర్చ్ లోనూ క్రిస్మస్ సందర్భంగా పిల్లలకు గిఫ్ట్ లు ఇస్తారు. ఈ ఉత్తరాన్ని చూసిన పలువురు గిఫ్ట్ లు ఇస్తామని ముందుకు వచ్చారని స్టువర్ట్ తెలిపాడు.

More Telugu News