bank q: క్యూలు మ‌రింత పెరిగిపోయాయ్... అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న జ‌నం

పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసి ఐదు వారాలు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ న‌గ‌దు కొర‌త ఇంకా అలాగే ఉంది. ప్ర‌జ‌లకు వంద రూపాయ‌ల నోట్లే కాదు.. రూ.2000 కొత్త నోటు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. గంట‌ల త‌ర‌బ‌డి బ్యాంకులు, ఏటీఎంల ముందు నిల‌బ‌డితే కానీ న‌గ‌దును తీసుకోలేక‌పోతున్నారు. అదీ కొంత మొత్తంలోనే అందుకుంటున్నారు. వరుసగా మూడు రోజుల సెలవు అనంతరం బ్యాంకులు ఈ రోజు తెరుచుకోవడంతో నగదు కోసం జనం బ్యాంకుల ముందు భారీగా క్యూలు క‌ట్టారు. ఎన్నో బ్యాంకుల ముందు సీన్‌ను రిపీట్ చేస్తూ నో క్యాష్ బోర్డులు త‌గిలించేస్తున్నారు. ఇంట్లో శుభ‌కార్యాలు, పార్టీలు వంటి విష‌యాల‌ను ప‌క్క‌కు పెట్టేసి, క‌నీసం నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుక్కోవ‌డానికి డ‌బ్బు దొరికితే చాలు అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

న‌గ‌దు ర‌హిత లావా దేవీల‌ను ఎంత‌గా ప్రోత్సహిస్తున్న‌ప్ప‌టికీ ఆ లావాదేవీలు అల‌వాటు లేని ప్ర‌జ‌లు డ‌బ్బు కోస‌మే ఎదురుచూస్తూ బ్యాంకుల వైపుకు క‌దులుతున్నారు. మరోపక్క ఏటీఎంల ముందు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ‘కొత్త ఏటీఎంలను తీసుకొస్తున్నాం, ఏటీఎంల సామ‌ర్థ్యాల‌ను పెంచుతాం, మినీ ఏటీఎంలు, మొబైల్ ఏటీఎంల‌ను పంపిస్తాం’ అని చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం ఆ చ‌ర్య‌లు తీసుకోక‌పోగా, క‌నీసం ఉన్న ఏటీఎంల‌లోనూ న‌గ‌దును అందుబాటులో ఉంచ‌లేక‌పోతోంది. దీంతో బ్యాంకులు, ఏటీఎంల ముందు ఈ రోజు బారీగా క్యూ క‌ట్టిన ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ప‌నుల‌న్నీ మానుకొని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వ‌స్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

More Telugu News