: ఇది ఇండియాలోనే అతి పెద్ద స్కాం.. బీజేపీ కుట్ర: పెద్దనోట్ల రద్దుపై చిదంబరం

భార‌త్‌లో 100శాతం న‌గ‌దుర‌హిత లావాదేవీలు జ‌రిగే అవ‌కాశాలు ఎక్క‌డ ఉన్నాయని కేంద్ర మాజీ ఆర్థిక‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబ‌రం ప్ర‌శ్నించారు. ఈ రోజు నాగ‌పూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై మాట్లాడుతూ ఎన్డీఏ సర్కారుపై మండిప‌డ్డారు. స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల‌ దేశంలో పేద‌లు ఎన్నో బాధ‌లు ప‌డుతున్నారని అన్నారు. ఇది ఎన్డీఏ స‌ర్కారు తీసుకున్న‌ అసంబద్ధ చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. స‌ర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఎదిరించ‌లేక‌ రాజీపడుతూ, క‌ష్టాలు ప‌డుతూ ప్ర‌జ‌లు బ‌తికేస్తున్నారని ఆయ‌న అన్నారు.

పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ఎన్డీఏ ఘోర‌మైన త‌ప్పు చేసిందని చిదంబ‌రం అన్నారు. టెర్ర‌రిస్టుల ద‌గ్గ‌ర‌ కూడా రెండు వేల నోట్లు దొరుకుతున్నాయని చెప్పారు. న‌ల్ల‌ధ‌నం ఉన్న‌వారిపై ఏ మాత్రం ప్ర‌భావం ప‌డ‌డం లేద‌ని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. ప్ర‌పంచంలోని ఏ దేశంలోనూ పూర్తిగా క్యాష్‌లెష్ ఎకాన‌మీ లేదని, ప్ర‌భుత్వ నేత‌లు మాత్రం మ‌న‌దేశంలో 100 శాతం న‌గ‌దుర‌హిత లావాదేవీలు జ‌ర‌గాల‌ని మాట్లాడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు భార‌త దేశంలోనే అతిపెద్ద స్కాం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. బ్యాంకులు ఖాతాదారుల‌కు రూ.24 వేలు ఎందుకు ఇవ్వ‌డం లేదని ప్ర‌శ్నించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.  ఈ నిర్ణ‌యంతో పేద‌లే ఇబ్బందులు ప‌డుతున్నారని, ధ‌న వంతులు ఎవ‌రూ క్యూలో నిల‌బ‌డ‌డం లేదని అన్నారు.

More Telugu News