: జగన్‌కు తడాఖా చూపించేందుకు సిద్ధమవుతున్న టీడీపీ.. కేసుల దర్యాప్తు, విచారణ తీరుపై సీరియస్

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసులు ‘ఎక్కడ వేసిన గొంగళి.. అక్కడే’ చందంగా ఉండడంపై టీడీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జగన్‌పై కేసుల విషయంలో సీబీఐ మెతక వైఖరి అవలంబిస్తోందని భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చినా, మిత్రపక్షం కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు జగన్‌ విషయంలో టీడీపీ పెద్దగా పట్టించుకోలేదు. జగన్‌ను కావాలనే ఇరుకున పెడుతున్నారన్న భావన రానీయలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణం ఓటుకు నోటు కేసు.

ఈ కేసులో తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీటులో చంద్రబాబు పేరు లేదు. దీంతో మరో చార్జిషీటు దాఖలు చేసి అందులో చంద్రబాబు పేరు చేర్చాలని, ఆయన పాత్రపై విచారణ జరపాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి స్పందించి ఉత్తర్వులు ఇచ్చినా హైకోర్టు కొట్టివేయడంతో ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. సరిగ్గా ఇదే టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వ విధానాలపైనా, నిర్ణయాలపైనా పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఏకంగా ముఖ్యమంత్రిపైనే కేసులు వేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన వారే తమపై కేసులు వేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంతకాలం జగన్‌పై పాటించిన సహనానికి స్వస్తి చెప్పి ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు టీడీపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. పార్టీ  ప్రతినిధి బృందాన్ని కేంద్రం వద్దకు పంపి ఆయనపై నమోదైన కేసుల విచారణ తీరుపై నిరసన తెలపాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. జగన్ కేసుల విషయంలో సీబీఐ గట్టి ప్రయత్నాలు చేయడం లేదని, కాంగ్రెస్ హయాంలో ఆగిపోయిన సీబీఐ దర్యాప్తులో మళ్లీ కదలిక లేదని టీడీపీ చెబుతోంది. 2004 తర్వాత పెరిగిన జగన్ వ్యక్తిగత ఆస్తులపైనా సీబీఐ విచారణ పూర్తిచేయలేదని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ బృందాన్ని కేంద్రం వద్దకు  పంపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

More Telugu News