: శశికళకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడంపై పార్టీని ప్రశ్నిస్తున్న ఎంపీ శశికళ పుష్ప

ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలను దివంగత జయలలిత ఆంతరంగికురాలు శశికళ చేతుల్లో పెట్టడంపై ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమ్మకు 35 ఏళ్లుగా శశికళ సేవలు చేస్తున్నారని తనకు తెలుసని, అలా అని పార్టీ అధినేత్రి పదవి ఎలా కట్టబెడతారంటూ ఆమె నిలదీశారు. మా ఇంట్లో 25 ఏళ్లుగా పని చేస్తున్న వ్యక్తికి నా పదవిని కట్టబెడతానా? అని ఆమె ప్రశ్నించారు. కేవలం శశికళ గ్రూపు కారణంగానే అమ్మకు ఏదో జరిగిందని అంతా నమ్ముతున్న ప్రస్తుత తరుణంలో, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎలా ఎన్నుకుంటారని ఆమె నిలదీశారు.

అంతే కాకుండా ఆమెకు పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేదని, అలాంటి శశికళ నటరాజన్ ను ఏ అర్హతతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఇంతాచేసి, ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టినా, పార్టీని నడిపించేది మాత్రం ఆమె భర్త నటరాజన్ అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆమె పేర్కొన్నారు. శశికళను ఏ దశలోనూ పార్టీ ప్రధాన కార్యదర్శిని చెయ్యాలని అమ్మ ఆలోచించలేదని ఆమె స్పష్టం చేశారు. తన తుది శ్వాస వరకు శశికళపై పోరాటం చేస్తానని ఆమె తెలిపారు. ఆమె కుట్రలు సాగనివ్వనని ఆమె హెచ్చరించారు. ప్రధాని మోదీ, లేదా ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని, కుట్రలకు తెరదించాలని ఆమె డిమాండ్ చేశారు. 

More Telugu News