: మీరు ప్రతి ఇంటినీ ఇబ్బందుల్లోకి నెట్టారు: ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన అసదుద్దీన్ ఒవైసీ

ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. మిలాదున్ నబీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ తన అహాన్ని సంతృప్తిపరచుకునేందుకు దేశంలోని ప్రతి ఇంటినీ ఇబ్బందుల్లోకి నెట్టారని అన్నారు. ఒక్క నిర్ణయంతో ప్రజల జీవన శైలిని ఇబ్బందుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. ఇవాళ బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో నిల్చున్న వారే రేపు ఎన్నికల్లో పోలింగ్ బూత్ ల ముందు నిల్చుని ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు.

'ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. రేపు మీరుండకపోవచ్చు. దేశానికి చాలా మంది ప్రధానులు వచ్చారు, వెళ్లారు. మీరు కూడా వెళ్లక తప్పదు. 15 లక్షల ఖరీదైన సూట్ వేసుకుంటూ, అత్యంత ఖరీదైన షాల్ వేసుకునే వ్యక్తి తనను తాను ఫకీరు అంటారు...మరి ఏ రకమైన ఫకీరో ఆయనకే తెలియాలి' అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 'మీరు ఫకీరు కాదు నియంత' అని ఆయన ఆవేశంగా అన్నారు. 50 రోజులు బాధలు ఓర్చుకోండి అని చెబుతున్న ఆయన 120 మంది వరకు మరణించినా ఎలాంటి పశ్చాత్తాపం కనబరచడం లేదని మండిపడ్డారు. నోట్ల రద్దు కారణంగా జీడీపీ పడిపోతుందని, 4 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని ఆయన చెప్పారు.

 నవంబర్ 8 నుంచి నవంబర్ 30 వరకు 12.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని, ఆ మొత్తం నల్లధనమేనా? అని ఆయన ప్రశ్నించారు. సెప్టెంబర్ 15 నుంచి 30 మధ్య 3.5 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయని, ఈ మొత్తం ఎవరిదో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదని, ఒకసారి నవ్వుతారని, మరోసారి ఏడుస్తారని, ఇంకోసారి తన ప్రాణాలకు ముప్పు ఉందని అంటారని ఆయన అన్నారు. తాము మాత్రం అయనను 150 ఏళ్లు బతకాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. 

More Telugu News