: రాజకీయాల్లోకి రజనీకాంత్? కొత్త పార్టీ ఏర్పాటు?.. సోదరుడి సంకేతాలు!

జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. అధికార అన్నాడీఎంకే పార్టీలో అంతర్గతంగా చాలా లుకలుకలు ఉన్నాయి. మరోవైపు కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను లాగి... ప్రతిపక్ష డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యత్నాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని ఎన్నో ఏళ్లుగా ఆయన అభిమానులు కోరుతున్నారని... అభిమానుల కోరిక నెరవేరడానికి ఇదే సరైన తరుణమని తెలిపారు.

 చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీ తాజా చిత్రం వచ్చే ఏడాది పూర్తవుతుందని... అప్పటి వరకు తమిళనాట రాజకీయ పరిస్థితులను ఆయన పరిశీలిస్తుంటారని... ఆ తర్వాత ఏదైనా జరగవచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ బీజేపీలో చేరుతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... అలాంటిదేమీ ఉండదని, రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీనే స్థాపిస్తారని చెప్పారు. పార్టీని స్థాపిస్తే రజనీ విజయం ఖాయమని తెలిపారు. ఆయన సోదరుడే స్వయంగా ఈ విషయాలను వెల్లడించడంతో... రజనీ రాజకీయ అరంగేట్రం త్వరలోనే ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News