: ఎస్ బీఐ నుంచి త్వరలో రూ.25 వేల పరిమితి గల క్రెడిట్ కార్డులు

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అల్పాదాయ వర్గాలకు ఉపయుక్తంగా ఉండేందుకుగాను రూ.25 వేల పరిమితి గల క్రెడిట్ కార్డులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) జారీ చేయనుంది. ఈ సందర్భంగా ఎస్ బీఐ కార్డ్స్, పేమెంట్ సేవల చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ జసూచా మాట్లాడుతూ, ప్రజల సమస్య డబ్బు లేకపోవడం కాదని, కొనుగోలు చేయడానికి వారి వద్ద క్రెడిట్ కార్డులు లేకపోవడమే అసలు సమస్య అని అన్నారు. ఖాతాదారులకు ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేకున్నా కార్డులు జారీ చేస్తామని, అయితే, వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న కొంత నగదును నిల్వగా కచ్చితంగా ఉంచుకుంటామని వివరించారు. రెండు, మూడు నెలల్లో ఇది కార్యరూపం దాలుస్తుందని విజయ్ జసుజా వెల్లడించారు. ప్రస్తుతం తొమ్మిది నుంచి పదకొండు రోజుల్లోగా క్రెడిట్ కార్డులను ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆ సంఖ్యను రెండుమూడు రోజులకు తగ్గిస్తామన్నారు. సాధారణంగా ఎనభై శాతం నగదు, ఇరవై శాతం కార్డు వినియోగించే వారు, ప్రస్తుతం తొంభై శాతం కార్డు, పదిశాతం నగదు వాడుతున్నారని చెప్పారు. పెద్దనోట్ల రద్దు అనంతరం, కార్డుల వినియోగం, లావాదేవీల సంఖ్య బాగా పెరిగిందని, ఏడాదిలో 9 నుంచి 10 లక్షల కార్డుల వ‌ృద్ధి సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయ్ జసుజా పేర్కొన్నారు.

More Telugu News