: డిజిటల్ రూపంలో చెల్లిస్తే కళ్లు చెదిరే బహుమతులు... ప్రభుత్వం ముందు ప్రతిపాదన

పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర సర్కారు... డిజిటల్ చెల్లింపులు చేసే వారిని ప్రోత్సహించేందుకు గాను ఆకర్షణీయ బహుమతులు అందించాలని నీతి ఆయోగ్ సంస్థ ప్రతిపాదించింది. వారం వారం, త్రైమాసికానికోసారి లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికి బహమతులు అందించాలని సూచించింది. ఎలక్ట్రానిక్ చెల్లింపులను సమాజంలోని అన్ని వర్గాలు ఆమోదించేట్టు ఉండాలని... ఇందులో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా తగిన పథకాన్ని తీసుకురావాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ను కోరినట్టు నీతి ఆయోగ్ తన ప్రకటనలో పేర్కొంది. ‘‘ఈ పథకంలో భాగంగా వినియోగదారులు, వ్యాపారులకు లక్కీ డ్రా ద్వారా ప్రతీ వారం బహుమతులు అందించాలి. అలాగే త్రైమాసికంలో మరోసారి లక్కీ డ్రా తీసి భారీ బహుమతులు ఇవ్వాలి. ముఖ్యంగా పేదవారు, దిగువ మధ్యతరగతి వారు, చిన్న వ్యాపారులను డిజిటల్ చెల్లింపుల్లో భాగం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని నీతి ఆయోగ్ సూచించింది. నవంబర్ 8 తర్వాత డిజిటల్ చెల్లింపులు చేసిన వారందరూ లక్కీ డ్రాకు అర్హులని, త్వరలోనే ఈ పథకం వెల్లడి కానుందని అధికార వర్గాల సమాచారం.

More Telugu News