: చెన్నై వైపునకు దిశ మార్చుకున్న వార్దా... ఊపిరి పీల్చుకుంటున్న కోస్తాంధ్ర

తీవ్ర తుపాను వార్దా తన దిశను మార్చుకుంది. ఇప్పటి వరకు ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం దాటుతుందనుకున్న వార్దా కాస్తా దిశ మార్చుకుని చెన్నై వైపు వేగంగా కదులుతోంది. దీంతో కోస్తాంధ్ర ప్రాంతం కాస్త తేలికపడింది. ఆదివారం ఉదయానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్దా తూర్పు దిశవైపు కదులుతోంది. అదే సమయంలో ఇది నెల్లూరుకి 520కిమీ దూరంలో ఉంది. సోమవారం మధ్యాహ్నం చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా అంచనాలు వెల్లడించింది. చెన్నై, పాండిచ్చేరి, నెల్లూరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండనుంది. ఒకవేళ మళ్లీ దిశను మార్చుకుంటే నెల్లూరు - చెన్నైల మధ్య తీరం దాటవచ్చని భావిస్తున్నారు. కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక, మిగిలిన పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం దాటే సమయంలో గాలులు 120 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని... విద్యుత్, సమాచార సేవలు, రహదారులపై ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

More Telugu News