: రక్తమోడిన ఇస్తాంబుల్... బాంబు పేలుళ్లకు 29 మంది మృతి

టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్ లోని ఓ ఫుట్ బాల్ స్టేడియం ముందు ఉగ్రమూకలు రక్తపాతం సృష్టించాయి. శనివారం రాత్రి కారు బాంబు, ఆ వెంటనే నిమిషం వ్యవధిలోనే ఓ ఆత్మాహుతి కార్యకర్త తనను తాను పేల్చేసుకోవడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 166 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని టర్కీ హోంశాఖ మంత్రి సులేమాన్ మీడియాకు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. దాడి సమయంలో ఫుట్ బాల్ మైదానంలో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. వేలాది మంది దీనికి హాజరయ్యారు. బెసిక్తాస్ జట్టుపై బుర్సాపూర్ జట్టు ఆట ముగియగా... విరామం సమయంలో స్టేడియం వెలుపల ఈ దాడి చోటు చేసుకుంది. పేలిపోయిన కారులో లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని 10 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ మొదలు పెట్టారు. దాడికి ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, కుర్దిష్ మిలిటెంట్లు తరచుగా టర్కీలో దాడులకు పాల్పడుతున్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై అమెరికాతో కలసి టర్కీ సైతం పోరాటం చేస్తోంది. తాజా దాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పాత్ర ఉండి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News