: విసుగెత్తి ఏటీఎంకి అంత్యక్రియలు నిర్వహించిన ప్రజలు!

ఏటీఎం సెంట‌ర్ల వ‌ద్ద నో క్యాష్ బోర్డులు క‌న‌ప‌డుతుండ‌డంతో ఖాతాదారులు తీవ్ర అస‌హ‌నంతో, ప‌లుచోట్ల ఏటీఎంల‌కు పూజ‌లు చేస్తూ తమ నిరస‌న‌ను వ్య‌క్తం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, బెంగళూరు వాసులు మాత్రం ఓ ఏటీఎంకు అంత్య‌క్రియలు నిర్వ‌హించారు. మైసూర్‌ బ్యాంక్‌ సర్కిల్‌లో ఉన్న ఏటీఎం వ‌ద్ద ఈ దృశ్యాలు క‌న‌ప‌డ్డాయి. ఏటీఎంలో న‌గ‌దు కోసం ఎదురుచూస్తూ విసుగెత్తిపోయిన కుమార్‌ జాగీర్దార్‌ అనే సామాజిక కార్యకర్త స్థానికుల‌తో క‌లిసి ఈ ప‌నిచేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. పెద్ద‌నోట్లు రద్దయిన రోజు నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆ ఏటీఎంలో నగదు లేదని, ఆ ఏటీఎం చనిపోయిందని వ్యాఖ్యానించారు. అందుకే మేము ఏటీఎంను అక్క‌డి నుంచి తొలగిస్తున్నామ‌ని చెప్పారు. సంప్రదాయం ప్ర‌కార‌మే అన్ని ఏర్పాట్లు చేసి ఏటీఎంకు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించామ‌ని, ఆ ఏటీఎం ఆత్మకు శాంతి చేకూరాలని తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు. త‌మ డ‌బ్బు తాము తీసుకోవడానికి వీల్లేకుండా పోయిందని చెప్పారు. దీని గురించి బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే 'నో క్యాష్‌.. సహకరించండి' అంటూ చెబుతున్నార‌ని అన్నారు. న‌గ‌దు కొర‌త‌తో నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక‌పోతున్నామ‌ని అన్నారు. తాము ఎందుకు సహకరించాలని, ఇకా ఎన్నాళ్లు సహకరించాలని ఆయ‌న ప్ర‌శ్నించారు. నగదుకొరత క‌ష్టాల‌పై అక్క‌డి జేడీయూ నేత సయ్యద్‌ మెహబూబ్‌ మాట్లాడుతూ.. తాము కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, కానీ సామాన్యులు ఎన్నో క‌ష్టాలు ఎదుర్కుంటున్నార‌ని అన్నారు. ఈ క‌ష్టాలు ఎప్పటికి పరిష్కారమవుతాయో చెప్పగ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు.

More Telugu News