: విజయ్ సెంచరీ, కోహ్లీ మరో రికార్డు... భారత్ దీటైన జవాబు

ఇంగ్లండ్ తో ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో మంచి స్కోరు దిశగా సాగుతూ, ఇంగ్లండ్ భారీ స్కోరుకు దీటైన జవాబిస్తోంది. ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. శుక్రవారం నాడు తొలి ఇన్నింగ్స్ ను ఒక వికెట్ నష్టానికి 146 పరుగుల వద్ద ముగించిన భారత జట్టు, నేడు ఆదిలోనే రెండో వికెట్ ను అదే స్కోరు వద్ద కోల్పోయినప్పటికీ, క్రీజలో పాతుకుపోయిన మురళీ విజయ్ కి కెప్టెన్ కోహ్లీ జత కావడంతో పరిస్థితి కుదుటపడింది. ఈ క్రమంలో విజయ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 235 బంతులాడిన విజయ్ 8 ఫోర్లు, మూడు సిక్సుల సాయంతో 102 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ తదనైన శైలిలో ఆడుతూ, టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని అధిగమించి రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 41 పరుగుల వద్దకు రాగానే 4 వేల పరుగులు సాధించిన ఆరవ ఇండియన్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ప్రస్తుతం భారత స్కోరు 75 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుతో పోలిస్తే, భారత జట్టు ఇంకా 179 పరుగుల వెనుకంజలో ఉంది.

More Telugu News