: కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకొని జయలలితకు ఆలయం కట్టిస్తోన్న వీరాభిమాని

ఇటీవ‌లే క‌న్నుమూసిన జ‌య‌ల‌లిత‌కు వీరాభిమాని అయిన ఓ వ్య‌క్తి ఆమెను దైవంలా కొలుస్తూ ఆమె రూపాన్ని త‌న క‌ళ్ల‌ముందే ఉంచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. జ‌య‌ల‌లిత‌కు ఆలయం నిర్మించేందుకు పూనుకున్నాడు. కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తోన్న ఆ వ్యక్తి ఇంకా కొన్నాళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి మ‌రీ ఈ పనికి దిగి ఆమెపై భ‌క్తి, గౌర‌వాన్ని చాటుకుంటున్నాడు. మ‌దురై లోని ఓడ‌ప‌ట్టి అనే ప్రాంతంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆయ‌న పేరు ఆర్‌ వేల్మురుగున్‌ (45). ఇప్పుడు ఆయ‌న తలపెట్టిన ఈ కార్యానికి అతడి కుటుంబ సభ్యులు కూడా సాయం అందిస్తున్నారు. జయలలితను ఓ దేవ‌తలా కొలిచే ఆయ‌న‌కు ఆమె అనారోగ్యం పాలయిందని తెలిసిన వెంటనే తన ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి కాశీ విశ్వేశ్వరుడి వద్దకు వెళ్లి అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థించాడు. కానీ, గుండెపోటు రావ‌డంతో జ‌య‌ల‌లిత మృత్యుఒడిలోకి చేరింది. షాక్ నుంచి తేరుకున్న ఆయ‌న అమ్మ‌కు ఆల‌యాన్ని క‌ట్టే ప‌నుల‌ను ప్రారంభించ‌నున్నాడు. ఇందుకోసం వ‌చ్చే ఏడాది జ‌యలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24ని మంచి ముహూర్తంగా నిర్ణ‌యించుకున్నాడు. ఈ ఆలయాన్ని పన్నీర్‌ సెల్వం చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని ఆయన భావిస్తున్నాడు. స‌ద‌రు కానిస్టేబుల్ వివ‌రాలు చూస్తే.. ఎంజీఆర్‌కు రామవరంలో ఉన్న ఇంటికి వేల్మురుగన్‌ తండ్రి సెక్యూరిటీగా ప‌నిచేస్తున్నాడు. త‌న‌కు ఇష్ట‌మైన పోలీసు ఉద్యోగాన్ని సంపాదించుకున్న వేల్మురుగ‌న్ జయలలిత ఇంటి వద్ద 1999 నుంచి 2002 వరకు సెక్యూరిటీ బాధ్యతలు కూడా చేశాడు. అక్కడ అమ్మ చిరున‌వ్వులు చిందుస్తూ క‌నిపిస్తుండ‌డం చూసి ప్ర‌తిరోజు మురిసిపోయేవాడ‌ట‌. జ‌య‌ల‌లిత‌కు సేవ‌చేస్తోంటే త‌న‌ కన్నతల్లికి సేవ చేస్తున్నట్లుగా భావించేవాడట. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను కాలేజీలో చ‌దివేట‌ప్పుడు జయలలిత త‌న‌కు ఓ ఆరాధ్య దైవం అని వ్యాఖ్యానించాడు. ప్రతి రోజు తాను ఆమె దర్శనం కోసం ఎదురు చూసేవాడిన‌ని, ఆమె ఇంటివ‌ద్దే తాను బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డం ఎంతో సంతోషం క‌లిగించింద‌ని చెప్పాడు. త‌న‌ అమ్మ చనిపోయింద‌ని, అయితే ఏఐఏడీఎంకే భవిష్యత్తు గురించి త‌న‌కు ఎలాంటి చింత లేదని పేర్కొన్నాడు. త‌న వ‌ర‌కు ఏఐఏడీంకే అంటే జ‌య‌ల‌లిత మాత్రమేన‌ని అన్నాడు. అందుకే అమ్మ‌కు ఆలయం నిర్మించుకుంటున్న‌ట్లు తెలిపాడు. ఈ కానిస్టేబుల్ గురించి చెప్పుకోవాల్సిన మ‌రో ఘ‌న‌త కూడా ఉంది. ఇత‌డు ప‌లు విభాగాల్లో ఏకంగా 14 గిన్నీస్ రికార్డుల‌ను సొంతం చేసుకున్నాడు. 81 గంట‌ల‌పాటు ఒంటికాలు మీద నిల‌బ‌డి ఓ గిన్నీస్ రికార్డు సొంతం చేసుకోగా, పెరియార్ రివర్‌లో 157 కిలో మీట‌ర్లు ఏక‌ధాటిగా ఈది మ‌రో రికార్డు సొంతం చేసుకున్నాడు. నాలుగు అడుగుల లోతున్న ఓ ట్యాంకులో 81 అడుగుల ఎత్తు నుంచి దూకి మ‌రో గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, ఆయ‌న త‌మిళ‌నాడులో 81 రోజుల్లో 3600 కిలోమీట‌ర్లు రోడ్ క్రాసింగ్ (ప‌రుగు పందెం) చేసినందుకు గాను ఆయ‌న‌కు గ‌తంలో మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గదు కూడా ల‌భించింది. 2004లో వ‌చ్చిన ఈ డ‌బ్బుని చీఫ్ మినిస్ట‌ర్ రీలీఫ్ ఫండ్ కు ఆయ‌న విరాళంగా ఇచ్చాడు.

More Telugu News