: ‘భారత్‌కు రక్షణ, సైనిక పరికరాలను సరఫరా చేయండి’.. ట్రంప్ కు నిర్దేశించిన ఒబామా ప్రభుత్వం

త్వరలో అమెరికా అధ్యక్ష పదవీ బాధ్య‌త‌ల నుంచి దిగిపోనున్న బ‌రాక్ ఒబామా ప్ర‌భుత్వం భారత్‌కు అవసరమైన రక్షణ, సైనిక పరికరాలను ఉదారంగా సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. ఈ అంశాన్నే త్వ‌ర‌లో బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ ట్రంప్ ప్రభుత్వానికి ఎజెండాగా నిర్దేశించింది. అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్ బాల్డ్‌విన్ కార్టర్ భారత ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త‌ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈ విష‌యం గురించి వారిరువురూ చ‌ర్చించుకున్నారు. మ‌రోవైపు ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు భారత్‌తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా అమెరికా సూచించిందని ఆస్టన్ బాల్డ్‌విన్ కార్టర్ తెలిపారు. త‌మ దేశం నుంచి పెద్ద ఎత్తున రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని, సైనిక పరికరాలను భార‌త్‌కు పంపేందుకు లెసైన్స్ నిబంధనలను ఖరారు చేసిందని కార్టర్ తెలిపారు. ఈ ఏడాది జూన్ లో త‌మ దేశం త‌మ‌ సన్నిహిత రక్షణ భాగస్వామ్య దేశాల సరసన భారత్‌ను అతిపెద్ద రక్షణ భాగస్వామి దేశంగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని గురించి ఆయ‌న గుర్తుచేశారు. భవిష్యత్తులో కూడా ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని తాము అనుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అఫ్ఘనిస్థాన్ పున‌ర్నిర్మాణంలో భాగంగా భారత్ ఆ దేశంలో పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, అఫ్గనిస్థాన్‌లో ప్రాజెక్టుల పేరుతో త‌మ దేశ‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటోందని పాకిస్థాన్ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. అఫ్ఘనిస్తాన్ పున‌ర్నిర్మాణానికి భారత్ చేస్తోన్న కృషిని అమెరికా గుర్తించిందని తెలిపారు.

More Telugu News