: జయలలిత కొన్ని సందర్భాల్లో చెప్పిన మాటలు... ఆమెలో పోరాటతత్వానికి ప్రతీకలు!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆటుపోట్లను తట్టుకుని జీవితాన్ని ఒంటరిగా విజయవంతంగా ఈదిన ధీశాలి. కొంత కాలం వరకు తల్లి మార్గదర్శకత్వంలో నడిచిన జయ, ఆ తరువాత ఒంటరిగా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న పోరాటయోధురాలు. అలాంటి జయలలిత వివిధ సందర్భాల్లో వివిధ రకాల వ్యాఖ్యలు చేశారు. అవి ఆమెలోని పోరాట తత్వాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను తెలియజేస్తాయి. వాటి వివరాల్లోకి వెళ్తే... 'నా జీవితం, వృత్తి ఒక సుడిగాలి లాంటిది' అని ఒక సందర్భంలో అన్నారు. మరొక సందర్భంలో 'నాలో కూడా శోకం, కోపం, బాధ ఉన్నాయి. కానీ, ఒక నాయకురాలి స్థానంలో వున్నప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది' అంటూ గొప్ప మనోనిబ్బరాన్ని ప్రదర్శించారు. ఇలా ఆమె ఎంజీఆర్ అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు గొప్ప మనోనిబ్బరాన్ని ప్రదర్శించారు. అలాగే అసెంబ్లీలో తీవ్ర పరాభవం జరిగినప్పుడు కూడా ఆమె ఎమోషనల్ గా బరస్ట్ అయినప్పటికీ, వెంటనే తేరుకుని సవాల్ చేసి, అనితరసాధ్యమైన మనోనిబ్బరాన్ని ప్రదర్శించారు. ఆ తరువాత ఓసారి ఒంటరితనం వేధించగా 'అమ్మ సంపాదించినదంతా కూడబెట్టి ఉంటే కనుక అసలు నేను సినిమాల్లోకే వచ్చుండేదాన్ని కాదు' అంటూ వాపోయారు. అలాంటి సందర్భంలో తానెందుకిలా మిగిలిపోయాన్న ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు ఆమె మాట్లాడుతూ, 'నన్ను బాగా చదివించి, సాధారణ కుటుంబపు అమ్మాయిలా 18, 19 ఏళ్లలోనే మంచి కుటుంబంలోకి ఇచ్చి పెళ్లి చేసుంటే, నేను నలుగురు పిల్లలకు అమ్మనై ఉండేదాన్ని. ఇన్ని ఎత్తుపల్లాలు నా జీవితంలో ఉండేవి కాదు' అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన జీవితం రాజకీయమే అని నిర్ణయించుకున్న తరువాత 'మన లక్ష్యం ఉన్నతమైంది! మన బాట స్పష్టమైనది! మన విజయం నిర్ణయించబడింది!' అంటూ ఆమె భవిష్యద్దర్శనం చేశారు. జీవితంలో ఇక సాధించేందుకు ఏమీ లేదని నిర్ణయించుకున్న తరువాత ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ, 'నాకంటూ వ్యక్తిగత జీవితం లేదు. నాకంటూ వ్యక్తిగత ఆశలు లేవు. నేను జీవించేది ఈ పార్టీ కోసం, తమిళ ప్రజల కోసం. ప్రాణాలివ్వమంటే పార్టీ కోసం ఇవ్వడానికి సిద్ధం' అని ప్రకటించారు. అలాగే తాను కూడా అందర్లా తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యానని చెప్తూ, 'నా జీవితంలో ఒక సందర్భంలో నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను' అంటూ వెల్లడించారు. అలాగే 'నేను చేసిన మొదటి తప్పు.. నా జీవితానికి సంబంధించిన అనేకమంది బతికుండగానే స్వీయచరిత్ర రాయడం మొదలుపెట్టడమయితే, రెండో తప్పు రాయడంలో చాలా ఫ్రాంక్‌ గా ఉండడం' అంటూ ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు.

More Telugu News