: బ్యాంకుల ముందు క్యూ తగ్గాలంటే ఇదొక్కటే మార్గం: ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్

నోట్ల రద్దు ప్రకటన వచ్చి నెల రోజులు దాటిందే తప్ప, కొత్త కరెన్సీని చాలినంతగా బ్యాంకులకు సరఫరా చేయడంలో ఆర్బీఐ విఫలం కాగా, బ్యాంకుల ముందు భారీగా క్యూలైన్లు, ఏటీఎంల ముందు ప్రజల పడిగాపులు ఎంత మాత్రం తగ్గలేదన్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తరువాత బ్యాంకులకు వస్తున్న డబ్బు రోజురోజుకూ తగ్గుతోంది. రెండు మూడు వారాల క్రితం ఒక్కో వ్యక్తికి రూ. 10 వేల వరకూ ఇచ్చిన బ్యాంకులు నేడు రూ. 2 వేలు, రూ. 4 వేలతో సరిపెడుతున్నాయి. కేంద్రం ఆదేశించినట్టుగా రోజుకు రూ. 24 వేలు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఏ బ్యాంకులో కూడా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు, ప్రజల అవస్థలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రజనీష్ కుమార్ స్పందించారు. సాధ్యమైనంత ఎక్కువగా రూ. 500 నోట్లను మార్కెట్లోకి తెస్తేనే పరిస్థితి మారుతుందని అన్నారు. రూ. 2 వేల నోట్లకు చిల్లర లభించకనే సమస్య పెరుగుతోందని వివరించారు. చిన్న నోట్లు వస్తేనే చిల్లర సమస్య తగ్గుతుందని స్పష్టం చేశారు. ఎస్బీఐ 49 వేల ఏటీఎంలను నిర్వహిస్తుండగా, 43 వేల ఏటీఎంలను కొత్త నోట్ల జారీకి అనుగుణంగా మార్చామని స్పష్టం చేశారు. రోజుకు రూ. 17 వేల కోట్ల నుంచి 19 వేల కోట్ల వరకూ ఏటీఎంలలో నింపుతున్నామని వెల్లడించారు.

More Telugu News