: బంతి తిరుగుతోంది... వివాదాస్పద బంతికి స్టోక్స్ అవుట్!

ముంబైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజున బంతి టర్న్ తిరుగుతోంది. తొలి రోజు ఆటను 5 వికెట్ల నష్టానికి 288 పరుగుల వద్ద ముగించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ ఉదయం తమ ఇన్నింగ్స్ ను నిదానంగా ప్రారంభించారు. సమయం గడుస్తున్న కొద్దీ స్పిన్నర్ల చేతుల్లో బంతి గింగిరాలు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. 97వ ఓవర్ ను వేసిన రవిచంద్రన్ ఆశ్విన్, తన అద్భుతమైన బంతికి క్రీజులో కుదురుకుని ప్రమాదకరంగా మారిన స్టోక్స్ ను అవుట్ చేశాడు. అశ్విన్ వేసిన బంతిని ఆడతున్న వేళ, బ్యాటు నేలకు తగిలింది. ఇదే సమయంలో బ్యాటును బంతి తగిలిందో, లేదో స్పష్టంగా తెలియలేదు. స్లిప్ లో ఉన్న కోహ్లీ ఆ బంతిని అందుకున్నాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా, రీప్లేలో బ్యాటును బంతి తాకుతూ వెళ్లినట్టు తెలిసింది. దీంతో స్టోక్స్ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించగా, ఆ నిర్ణయం పట్ల అసంతృప్తిని తెలుపుతూ స్టోక్స్ మైదానం వీడాడు. ఇక 108వ ఓవర్ మూడవ బంతికి జడేజా బౌలింగ్ లో కీపర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వోక్స్ అవుటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 111 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 333 పరుగులు. కాగా, బట్లర్ 41, రషీద్ 4 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News