: మొతేరాలో సిద్ధమవుతున్న మోదీ కలల క్రికెట్ గ్రౌండ్... ప్రపంచంలోనే అతిపెద్దది!

సుమారు ఒక లక్షా పది వేల మంది కూర్చోగలిగే ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ గుజరాత్ లోని మొతేరాలో సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ కు అందిస్తున్న కలల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ స్టేడియాన్ని లార్సెన్ అండ్ టూబ్రో నిర్మిస్తోంది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రస్తుతం అమిత్ షా ఉన్న సంగతి తెలిసిందే. ఇక స్టేడియం నిర్మాణం నిమిత్తం జీసీఏ ఉపాధ్యక్షుడు పరిమళ్ నత్వానీ, ఎల్ అండ్ టీ ఉన్నతోద్యోగులు, జీసీఏ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. మొతేరాలోని క్రికెట్ మైదానాన్ని మరింత విస్తృత పరచాలన్నది జీసీఏ అభిమతం. కాగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న క్రికెట్ మైదానంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ సీటింగ్ కెపాసిటీ 1,00,204 కాగా, నిర్మాణం పూర్తయితే, మొతేరా మైదానం ఆ రికార్డును బద్దలు కొడుతుంది. ఇక మైదానం సిద్ధమైన తరువాత, అంత భారీ సంఖ్యలో క్రీడాభిమానులు మైదానం లోనికి వెళ్లి, సులువుగా, వేగంగా బయటకు వచ్చేందుకు అవసరమైనన్ని ద్వారాలను ఏర్పాటు చేయనున్నట్టు జీసీఏ కార్యదర్శి రాజేష్ పటేల్ వెల్లడించారు.

More Telugu News