: నోట్ల రద్దు ఎఫెక్ట్: భారత్‌కు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న విదేశీయులు

నోట్ల రద్దు తర్వాత దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ తగ్గిపోవడంతో భారత్‌కు వచ్చేందుకు విదేశీయులు జంకుతున్నారు. తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవడమో, లేదంటే రద్దు చేసుకోవడమో చేస్తున్నారు. పలువురు అంతర్జాతీయ ఖాతాదారులు, కార్పొరేట్లు, టూరిస్టులు భారత్‌కు వచ్చేందుకు జంకుతున్నట్టు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా(హెచ్ఆర్ఏడబ్ల్యూఐ) పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత మహారాష్ట్రలో 20 శాతం క్యాన్సిలేషన్లు నమోదైనట్టు తెలిపింది. విదేశీ టూరిస్టుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్టు పూణేకు చెందిన ప్రభుత్వ గైడ్ దయా సుధామ తెలిపారు. నగరానికి వచ్చే క్లయింట్లు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. తగినంత ద్రవ్యం అందుబాటులో లేనప్పుడు తామెలా అక్కడ ఉండగలమని ప్రశ్నిస్తున్నట్టు సుధామ తెలిపారు. విదేశీయులు కార్డు ద్వారా పేమెంట్ చేస్తే అదనపు చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. నోట్ల రద్దు తర్వాత నెలరోజులుగా ఒక్క టూరిస్టును కూడా తాను ఇప్పటి వరకు రిసీవ్ చేసుకోలేదని వివరించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపించిందని హెచ్ఆర్ఏడబ్ల్యూఐ అధ్యక్షుడు దిలీప్ దత్వాని పేర్కొన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన ఫలిప్పా కాయె మాట్లాడుతూ తన నలుగురు స్నేహితులు ఇండియా వచ్చేందుకు నిర్ణయించుకున్నారని, కానీ నోట్ల రద్దు తర్వాత తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారని తెలిపారు. భారత్‌లో ఉన్న విదేశీ పర్యాటకుల్లో చాలామంది మధ్యలోనే తమ పర్యటనను ముగించుకుని స్వదేశాలకు తరలుతున్నట్టు కాపర్ ట్రావెల్ కంపెనీ మేనేజర్ అర్వింద్ జైస్వాల్ తెలిపారు.

More Telugu News