: తమ ఖాతాల్లో 80 లక్షల రూపాయలు చూసి బిత్తరపోయిన పింఛనుదారులు

నల్లకుబేరులు, బ్యాంకులు కుమ్మక్కై చేస్తున్న ధనమార్పిడి లీలలు చూసి అంతా బిత్తరపోతున్నారు. ఇప్పటికే ఈ రెండు వర్గాలు కుమ్మక్కుపై దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలంలో వెలుగు చూసిన వివరాలు చూస్తే... నల్లకుబేరులతో బ్యాంకుల కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే... ములగపూడికి చెందిన 15 మంది పింఛనుదారులు తమ ఖాతాల్లో ప్రభుత్వం ఇచ్చే పింఛను పడిందో లేదో చూసుకునేందుకు వెళ్లారు. తమ ఖాతా పుస్తకాలు పట్టుకుని, ఖాతాల్లోని నిల్వచూసుకున్న వీరికి కళ్లుతిరిగినంత పనైంది. ఎందుకంటే, ఎప్పుడూ వెయ్యి రూపాయలకు మించి బ్యాలెన్స్ ఉండని తమ ఖాతాల్లో లక్షలాది రూపాయల బ్యాలెన్స్ కనిపించింది. దీంతో మరోసారి సరి చూసుకున్న వీరు.. తమ 15 మంది ఖాతాలో 80 లక్షల రూపాయలు ఉండడంతో ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మొత్తం తమ ఖాతాల్లో పడడంతో వారంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అయితే ఈ మొత్తం నల్లకుబేరుల ధనమా? లేక బ్యాంకు అధికారుల మాయాజాలమా? అదీ కాకపోతే సాంకేతిక తప్పిదమా? అన్నది తెలియాల్సి ఉంది.

More Telugu News