: నోట్ల రద్దుతో ఉగ్రవాదం పోతే.. ప్రపంచ దేశాలన్నీ ఆ పనే చేసేవి!: శివసేన

పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాదం పోతుందనుకుంటే ప్రపంచ దేశాలన్నీ ఆ పనే చేసేవని శివసేన పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డబ్బుల కోసం ప్రజలు కాళ్లు వాచేలా బ్యాంకుల ముందు నిల్చుంటే, దానిని దేశభక్తితో పోల్చడం సరికాదంటూ ప్రభుత్వంపై మండిపడింది. ఇలా పోల్చడం దేశభక్తిని పరిహసించడం తప్ప మరొకటి కాదని పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. నోట్ల రద్దుతో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించవచ్చనుకుంటే ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడో ఆ పనిచేసేవని అన్నారు. శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న తీరుపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఠాక్రే స్పందిస్తూ.. అద్వానీ మాట వినాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ నేత అయిన ఆయన మాటలను ప్రతి ఒక్కరు గౌరవించాలని అన్నారు. కాగా నోట్ల రద్దు అంశంపై శివసేన పార్టీ నేతలు గురువారం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చర్చించారు. అలాగే నోట్ల రద్దు కారణంగా రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కూడా కలిసి ఇదే విషయంపై చర్చించారు.

More Telugu News