: ఆ మూడు విమానాల్లోని పైలట్లు 'నాటీ'గా ప్రవర్తించారు...అందుకే సస్పెండ్ చేశాం: డీజీసీఏ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కోల్‌ కతా విమానాశ్రయంలో ఆలస్యంగా లాండవ్వడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె హత్యకు కుట్రపన్నారని, అందుకే విమానంలో ఇంధనం అయిపోతోందని పైలట్ ఫిర్యాదు చేసినా, అధికారులు ల్యాండింగ్‌ కు అనుమతినివ్వలేందంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు తీవ్ర స్థాయిలో లోక్‌ సభలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ విమానం ల్యాండింగ్‌ ‘ఆలస్యం’ వెనుక అసలు రహస్యాన్ని డీజీసీఏ వెల్లడించింది. నిజానికి ఇంధనం అయిపోయిందనడం అవాస్తవమని, సకాలంలో విమానాన్ని ల్యాండింగ్‌ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయంతోనే పైలట్లు ‘నాటీ’గా (కొంటెగా) వ్యవహరించారని డీజీసీఏ తెలిపింది. ఆ సమయంలో ల్యాండింగ్ కోరిన (ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్) మూడు విమానాల్లోనూ కావాల్సినంత ఇంధనం ఉందన్న సంగతి విచారణలో తేలిందని తెలిపారు. ఇన్ టైమ్ ల్యాండింగ్ పేరుతో మంచి పేరుతెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఫోన్ చేసి ఇంధనమైపోయిందని ఫిర్యాదు చేశారని పౌర విమానాయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ప్రకటనలో తెలిపారు. నిజాలు నిర్ధారణ కావడంతో ఆ సమయంలో విమానంలో విధులు నిర్వర్తిస్తున్న పైలట్లతో పాటు, సిబ్బందిని కూడా వారం రోజులపాటు సస్పెండ్ చేశామని వెల్లడించారు.

More Telugu News