: పొదుపు సొమ్ము ఇవ్వమంటే, అప్పు కింద జమ చేసుకుంటామన్న బ్యాంకు అధికారులు .. కాబోయే పెళ్లికూతురి ఆవేదన!

పెద్దనోట్ల రద్దు సమస్యతో ఎన్నో పెళ్లిళ్లు ఇప్పటికే వాయిదాపడ్డాయి. సరైన సమయానికి నగదు చేతికి అందక, బ్యాంకుల్లో, ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డులు ఉండటంతో వెనుదిరిగిన ఎన్నో పెళ్లి కుటుంబాల వార్తలు విన్నాం. కాగా, ఈ నెల 9వ తేదీన.. అంటే రేపటి రోజున వివాహం అనగా, కాబోయే పెళ్లి కూతురుకి పెద్ద సమస్య వచ్చిపడింది. తన ఖాతాతో పాటు, తమ్ముడి బ్యాంకు ఖాతాలో కూడా పొదుపు చేసుకున్న డబ్బులను అప్పు కింద జమ చేసుకున్నారు బ్యాంకు అధికారులు. దీంతో, దిక్కుతోచని స్థితిలో పడింది ఆయువతి. అనంతరరం జిల్లా శింగనమల మండలంలోని రాచేపల్లికి చెందిన శోభారాణికి, ఆమె సోదరుడికి సకలం చెరువు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ లో అకౌంట్లు ఉన్నాయి. రేపు కడపలో తన పెళ్లి జరగనున్న నేపథ్యంలో డబ్బు తీసుకునేందుకు నిన్న ఆమె బ్యాంకుకి వెళ్లింది. అయితే.. తన ఖాతాలోని రూ.6 వేలు, తన తమ్ముడి ఖాతాలో ఉన్న రూ.20 వేలు తీసుకోవడానికి వీలు లేదని, వారి తండ్రి అప్పు కింద ఆ మొత్తాన్ని జమ చేసుకుంటామని బ్యాంకు అధికారులు చెప్పడంతో శోభారాణి నిర్ఘాంతపోయింది. తెల్లవారితే పెళ్లి... ఉన్న డబ్బును తీసుకునేందుకు వెళితే బ్యాంకు అధికారులు ఆ మాట చెప్పడంతో కన్నీటి పర్యంతమైంది. తమ అకౌంటులో ఉన్న ఆ కొద్దిపాటి నగదూ తీసేసుకుంటే తన పెళ్లి ఖర్చులకు ఉండవని.. దాంతో పెళ్లి ఆగిపోతుందనే విషయాన్ని బ్యాంకు అధికారులకు ఆమె ఏకరువు పెట్టింది. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. కాగా, ఈ విషయమై బ్యాంకు మేనేజర్ సయ్యద్ వివరణ ఇస్తూ.. శోభారాణి తండ్రి బ్యాంకుకు అప్పు పడ్డారని, అందుకే, ఆ కుటుంబానికి చెందిన వారి ఖాతాల్లో కొంత సొమ్మును జమ చేసుకుని, మిగిలింది ఇచ్చేస్తామని చెప్పారు.

More Telugu News