: మోదీజీ ఇలా ఎంత కాలం పరుగెడతారు?: రాహుల్ గాంధీ ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోదీ ఎంత కాలం పార్లమెంటును తప్పించుకుని పరుగులెడతారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో డీమోనిటైజేషన్ అనంతరం నెలకొన్న పరిస్థితులపై ఆందోళన నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ స్థిరంగా ఒక అంశంపై మాట్లాడడం లేదని, ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. నల్లధనానికి వ్యతిరేకంగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని చెప్పిన ప్రధాని, ఊరికే ఏడవడం మొదలు పెట్టారని విమర్శించారు. ఆ తరువాత ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెద్ద నోట్లు రద్దు చేశామన్నారని, అయితే ఉగ్రవాదుల వద్ద కొత్త 2000 రూపాయల నోట్లు దొరకడంతో మోదీ చెప్పేది వాస్తవం కాదన్న విషయం అర్థమైందని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత నల్ల కుబేరుల కోసం అన్నారని, అయితే వారికి ఎలాంటి ఇబ్బంది లేదని, వారంతా ఎవరితో కుమ్మక్కై డబ్బులు మార్చుకుంటున్నారో దేశంలోని అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. ఆ తరువాత డిజిటలైజేషన్ అంటున్నారని, అంటే బీజేపీ నేతలు దేశంలోని అన్ని ప్రాంతాలకు డిజిటల్ సేవలు విస్తరించామన్న భ్రమల్లో జీవిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ డిజిటల్ చెల్లింపుల వల్ల ఎన్ని సంస్థలు లాభాల్లోకి వెళ్లాయో కూడా అందరికీ తెలిసిందేనని, ఇలా రోజుకో కారణం చెప్పి ఎంత కాలం ప్రధాని పరుగులు పెడతారని ఆయన ప్రశ్నించారు. అసలు ఇంత తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఎవరు కారణం? అని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక మనిషి నిర్ణయాన్ని దేశం మొత్తం మీద రుద్దవచ్చా? అని ఆయన అడిగారు. అలా చేస్తే ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చినట్టేనా? అని బీజేపీని ప్రశ్నించారు. నెల రోజులు ముగిసినా పనులు మానుకుని ప్రజలు బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారని, అధికారం కట్టబెట్టిన ప్రజలకు ఇంత పెద్ద శిక్ష విధించడం న్యాయమా? అని ఆయన నిలదీశారు.

More Telugu News