: నేడు బ్లాక్ డేగా పాటిద్దామంటూ పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ... ఢిల్లీలో భారీ ర్యాలీ

పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు గడుస్తున్నా... ఇంతవరకు కష్టాలు మాత్రం తీరలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. నోట్ల రద్దు ఒక మూర్ఖపు నిర్ణయమని అన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాహుల్ ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నోట్లను రద్దు చేసిన నాడు మోదీ మాట్లాడిన దానికి... ఈ రోజు ఆయన మాట్లాడుతున్న దానికి సంబంధం లేదని రాహుల్ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తుందని మోదీ చెప్పారని... కానీ, ఇప్పటి వరకు ఎంత నల్లధనం బయటకు వచ్చిందో చెప్పమని అడిగినా, ఎలాంటి వివరాలను ఇవ్వడం లేదని విమర్శించారు. నోట్ల రద్దుతో తీవ్రవాదం తగ్గుతుందని మోదీ చెప్పారని... కానీ, తీవ్రవాదుల వద్ద కొత్త నోట్లు బయటపడుతున్నాయని ఎద్దేవా చేశారు. మోదీ నిర్ణయంతో అందరూ బాగానే ఉన్నారని... పేద ప్రజలు మాత్రం ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు బ్లాక్ డే పాటిద్దామని పిలుపునిచ్చారు. నోట్ల రద్దుపై పార్లమెంటులో చర్చించాలని... ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రతి రోజూ మోదీ మాట మారుస్తూ వస్తున్నారని విమర్శించారు.

More Telugu News