: అన్నాడీఎంకేలో ప్రారంభమైన వారసత్వ పోరు.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ సహా ముగ్గురు పోటీ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ఇలా ముగిశాయో లేదో.. వారసత్వ పోరు అలా మొదలైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి జయ నెచ్చెలి శశికళ సహా సీనియర్ నేతలు సెంగొట్టయ్యన్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైలు పోటీపడుతున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మృతి తర్వాత ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని జయ చేపట్టలేదు. ఆ పదవి తనకు కలిసి రాదన్న కారణంతోనే జయ దానికి దూరంగా ఉన్నారు. మూడు దశాబ్దాలకుపైగా పార్టీని ముందుకు నడిపిన జయ ఏడుసార్లు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె మృతితో వీలైనంత త్వరగా కొత్త వారిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జయకు అత్యంత అప్తురాలైన శశికళకే ఆ పదవి ఇవ్వాలని పార్టీ నేతల్లో చాలామంది భావిస్తున్నారు. అయితే గతంలో జయకు అత్యంత సన్నిహితంగా మెలిగిన సీనియర్ నేత సెంగొట్టయ్యన్ అకస్మాత్తుగా తెరపైకి వచ్చారు. ఆయన వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆయనకే ఆ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ తంబిదురై కూడా ఈ పదవికి పోటీపడుతున్నట్టు సమాచారం.

More Telugu News