: ప్రముఖులను పొట్టనపెట్టుకున్న డిసెంబరు.. హేమాహేమీలందరూ ఈ నెలలోనే..

విషాదానికి డిసెంబరు నెల మారుపేరుగా నిలుస్తోంది. దేశం ఎందరో ప్రముఖులను కోల్పోయింది ఈ నెలలోనే. మరీ ముఖ్యంగా కన్నుమూసిన వారందరూ తమిళులు కావడం మరో విషాదం. బ్రిటిష్ ఇండియాలో చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, రాజకీయ వేత్త, లాయర్, భారత రత్న అవార్డు గ్రహీత చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) డిసెంబరు 25, 1972న కన్నుమూశారు. ద్రవిడార్ కళగం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించిన పెరియార్ ఈవీ రామస్వామి (ఈరోడ్ వెంకట రామస్వామి) డిసెంబరు 24, 1973న తుదిశ్వాస విడిచారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన చిరపరిచితుడు. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్.. ఎంజీఆర్‌గా ఖ్యాతిగాంచిన ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నటుడిగా, రాజకీయనాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆయన కూడా డిసెంబరు 24, 1997లో కన్నుమూశారు. ఆయన శిష్యురాలు, నటి, నేత, ఆరుసార్లు సీఎంగా పనిచేసి రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ‘అమ్మ’ జయలలిత కూడా మొన్న డిసెంబరు 5న కానరాని లోకాలకు తరలిపోయిన విషయం తెలిసిందే. కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న అవార్డు గ్రహీత, సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేసిన మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి డిసెంబరు 11, 2004లో సంగీత ప్రపంచాన్ని దు:ఖసాగరంలో ముంచి దివికేగారు. శ్రీనివాస అయ్యర్ రామస్వామి.. చోరామస్వామిగా అందరికీ తెలిసిన ఈయన నిన్న (డిసెంబరు 7, 2016) కన్నుమూశారు. నటుడిగా, సంపాదకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, డైరెక్టర్‌గా, న్యాయవాదిగా పనిచేసిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. దివంగత ముఖ్యమంత్రి జయకు అత్యంత ఆప్తుడు అయిన ఆయన ‘అమ్మ’ కన్నుమూసిన రెండు రోజులకే తుదిశ్వాస విడిచారు. కైలాసం బాలచందర్.. కె.బాలచందర్‌గా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆయన రజనీకాంత్, కమలహాసన్ వంటి ఎందరో ప్రముఖ నటులకు నటజీవితం ప్రసాదించారు. దాదాసాహెబ్ ఫాల్కే సహా ఎన్నో అవార్డులు అందుకున్న బాలచందర్ డిసెంబరు 23, 2014లో కన్నుమూశారు. ఆంధ్రరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు సుదీర్ఘ నిరాహార దీక్ష తర్వాత ఇదే నెలలో చెన్నైలో కన్నుమూశారు.

More Telugu News