: బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో నూటమూడేళ్ల బామ్మ.. మొక్కలే ఆమెకు పిల్లలు!

కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క వయసు 103 సంవత్సరాలు. ఆమె నిరక్షరాస్యురాలు. అయితేనేం, 2016 అత్యంత ప్రభావశీలురైన మహిళల బీబీసీ జాబితాలో ఆమె స్థానం దక్కించుకుంది. ఎందుకంటే, ఆమె ఆదర్శ పర్యావరణ వేత్త. తిమ్మక్క పర్యావరణ వేత్తగా మారడం వెనుక అసలు విషయం ఆమెకు సంతానం లేకపోవడమే! దీంతో, పిల్లలు లేకపోతేనేం, మొక్కలనే పిల్లల్లాగా పెంచుకుందామని తిమ్మక్క దంపతులు నాడు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు 384 మర్రి చెట్లు ఉన్నాయి. రోజుకూలీ చేసే తిమ్మక్క, పశువుల కాపరి చిక్కయ్యల వివాహం వారి చిన్నవయసులోనే జరిగింది. అయితే, వారికి సంతానం మాత్రం కలగలేదు. దీంతో, కుంగిపోని ఆ దంపతులు మొక్కలనే పిల్లల్లా పెంచాలని నిర్ణయించుకున్నారు. దీంతో, కర్ణాటకలోని స్టేట్ హై వే 94.. హులికల్ నుంచి కూడూర్ మధ్యలో మొట్టమొదటగా పది మర్రి మొక్కలను, ఆ తర్వాతి సంవత్సరంలో పదిహేను, ఇలా ప్రతి ఏడాది నాటే మొక్కల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. వాటికి నిత్యం నీళ్లు పోయడం, వాటి రక్షణకు కంచెలు నాటడం వంటి పనులతో బిజీగా గడిపేవారు. అయితే, 1991లో భర్త చిక్కయ్య చనిపోవడంతో తిమ్మక్క ఒంటరి అయిపోయింది. అయినప్పటికీ, చెట్లను పెంచే బాధ్యత నుంచి పక్కకు తప్పుకోలేదు. ఇప్పటివరకు 384 మర్రిచెట్లను పెంచిన ఆదర్శ పర్యావరణవేత్తగా నిలిచిన ఆమె చెప్పే పాఠాలు వినడానికి పర్యావరణ కార్యకర్తలు ఆమెను కలుస్తుండటం విశేషం. ‘పిల్లలు లేకపోతేనేం..మొక్కలే నా పిల్లలు’ అంటున్న తిమ్మక్క ఇంటిపేరు ఏంటో తెలియదు గానీ, ‘సాలుమరద’ అనే పేరు మాత్రం స్థిరపడిపోయింది. ‘సాలుమరద’ అంటే చెట్ల వరుస అని అర్థమట!

More Telugu News