: ఆదాయపు పన్ను శాఖకు షాక్: 10వేల కోట్లు ప్రకటించాడు... సోదా చేస్తే లక్షన్నరే తేలింది!

ఆదాయపు పన్ను అధికారులకు హైదరాబాదులోని వ్యాపారవేత్త లక్షణ్ రావు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం సమయంలో తన వద్ద రూ. 10 వేల కోట్లు ఉన్నాయంటూ లక్ష్మణ్ రావు ప్రకటించారు. అయితే, నిబంధనల ప్రకారం ఆ మొత్తానికి కట్టాల్సిన ట్యాక్స్ తొలి వాయిదాను ఇంతవరకు ఆయన చెల్లించలేదు. దీంతో, ఐటీ అధికారులు ఫిలింనగర్ లోని ఆయన ఇంటిపై దాడులు జరిపారు. పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహించారు. సాధారణంగా ఐటీ అధికారుల సోదాల్లో ఆదాయానికి మించిన నగదు, ఆస్తులు బయటపడతాయి. కానీ, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే తన వద్ద రూ. 10వేల కోట్లు ఉన్నాయని ఆయన ప్రకటించినా... అక్కడ లెక్క తేలింది మాత్రం రూ. 1.42 లక్షలే. బీఎల్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోలక్ష్మణ్ రావు, ఆయన భార్య రమాదేవిలు డైరెక్టర్లుగా ఉన్నారు. లక్షణ్ రావు మరో మూడు కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 2014 మార్చి 31న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద తమ ఆస్తులను వారు ఫైల్ చేశారు. దాని ప్రకారం వారి ఆస్తి రూ. 1.42 లక్షలు మాత్రమే. అంతకు మించి వీరి వద్ద నుంచి అధికారులకు ఏమీ దొరకలేదు. దీంతో, అధికారులు షాక్ కు గురయ్యారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News