: ఏపీ ప్రజలకు తీపి కబురు.. నేడు రాష్ట్రానికి రానున్న రూ.1100 కోట్లు

నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. నేడు(బుధవారం) రాష్ట్రానికి రూ.1100 కోట్ల నగదు రానున్నట్టు పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే రూ.50, రూ.20 నోట్లు కూడా రానున్నాయని, ఇవి కూడా చేరుకుంటే ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయన్నారు. మంగళవారం అధికారులు, బ్యాంకర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. రైతులు తమకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. రేషన్ సరుకులను రాష్ట్రవ్యాప్తంగా అరువుపై పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 66 శాతం ఇలాగే పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిండికేట్ బ్యాంకు మేనేజర్ మోహన్ మాట్లాడుతూ 8వేల కరెంట్ ఖాతాలను ప్రారంభించామని తెలిపారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. నేడు నూజివీడులో నగదు రహిత లావాదేవీలపై వెయ్యిమందికి శిక్షణ ఇవ్వనున్నట్టు ఆంధ్రాబ్యాంకు డీజీఎం కృష్ణారావు తెలిపారు. 20 లక్షల మంది విద్యార్థులతో అంతే సంఖ్యలోని కుటుంబాలకు నగదు రహిత లావాదేవీలపై శిక్షణ ఇప్పించనున్నట్టు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా వివరించారు.

More Telugu News