: బాల్యం నుంచి అంత్యక్రియల వరకు జయ జీవితమంతా ప్రత్యేకతల మయమే!

ఒక చరిత్ర ముగిసిపోయింది. ఒక యోధురాలు తన పోరాటాన్ని ముగించి, శాశ్వతంగా సెలవు తీసుకొని వెళ్లిపోయింది. బాల్యం నుంచి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలిచి... సినీ రంగంలో, రాజకీయరంగంలో ఓ వెలుగు వెలిగిన పురచ్చితలైవి జయలలిత... తన సుదీర్ఘ ప్రయాణంలో అలసిపోయి, శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. జీవితంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ, ప్రతి విషయంలో విజేతగా నిలిచారు. తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన జయలలిత... ఆ తర్వాత తన బాల్యాన్ని మైసూరులోని పిన్నమ్మ, బెంగళూరులోని అమ్మమ్మ, తాతయ్యల వద్ద గడిపింది. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులో ఆమె తల్లి వేదవల్లి జయను చెన్నై తీసుకెళ్లారు. చెన్నైలో చర్చ్ పార్క్ ప్రెజెంటేషన్ కాన్వెంట్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన జయ... 10వ తరగతిలో గోల్డ్ స్టేట్ అవార్టును సొంతం చేసుకున్నారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు తరలి వెళ్లినా చదువులో ఎంతో ప్రతిభ కనబరిచి... టాపర్ గా నిలిచారు. చిన్న వయసులోనే క్లాసికల్ మ్యూజిక్, వెస్టర్న్ క్లాసికల్ పియానో, భరతనాట్యం, మోహిణిఅట్టం, మణిపురి, కథక్ లాంటివాటిని నేర్చుకోవడమే కాక... స్టేజ్ షోలను కూడా జయలలిత ఇచ్చారు. తదనంతర కాలంలో సినీరంగ ప్రవేశం చేసిన జయ... వెండితెరను మకుటం లేని మహారాణిలా ఏలారు. దక్షణాదిలో అగ్రనటులైన ఎంజీఆర్, ఎన్టీఆర్, శివాజీ గణేషన్, శోభన్ బాబు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహామహులతో ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. 140కి పైగా సినిమాల్లో జయ నటిస్తే... 100కి పైగా సినిమాలు సూపర్ హిట్లే. ఆ తర్వాత అన్నాడీఎంకే అధినేత ఎంజీఆర్ అండతో 1982లో ఆమె రాజకీయ రంగప్రవేశం చేశారు. 1983లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1984లో రాజ్యసభలో ఆమె తొలిసారి ప్రసంగించారు. ఆమె ప్రసంగం వినేందుకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోక్ సభ నుంచి రాజ్యసభకు వచ్చారట. ఆమె ప్రసంగం ఇందిరతో పాటు సభలోని వారందరినీ మంత్రముగ్ధులను చేసింది. 1991లో తమిళనాడు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలను స్వీకరించారు జయ. అనంతరం తమిళనాడులో తిరుగులేని రాజకీయశక్తిగా జయ అవతరించారు. ఆ తర్వాత, సీఎం పదవిని ఐదుసార్లు చేపట్టారు. తన రాజకీయ ప్రత్యర్థి కరుణానిధికి పక్కలో బల్లెంలా మారారు. కేంద్ర రాజకీయాలలో కూడా జయ తనదైన ముద్రను వేశారు. రెబల్ రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన జయలలిత... 1991లో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కేవలం 11 రోజులకే కూల్చివేశారు. ఈ రకంగా... రాజకీయరంగంలో కూడా జయలలిత తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. మరోవైపు మహిళల సాధికారత, పేద ప్రజల సంక్షేమం కోసం జయలలిత ఎంతో కృషి చేశారు. పేదలు సంతోషంగా బతకాలనే ఆకాంక్షతో... ఆమె ప్రవేశ పెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు జయ పథకాలను అధ్యయనం చేశాయంటే... అవి ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. జయ ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ సిమెంట్, పిల్లలకు ఉయ్యాలలు, పెళ్లిళ్లకు బంగారం, అమ్మ ల్యాప్ టాప్స్, అమ్మ ఫార్మసీ, అమ్మ మొబైల్ స్కీమ్, అమ్మ విత్తనాలు, అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్, చెన్నై స్మాల్ బస్, శ్రీలంక తమిళ కాందిశీకులకు ఉచిత బీమా పథకం, తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జయలలిత... పేద ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. మన దేశంలో ఇప్పటి వరకు మరే ఇతర ముఖ్యమంత్రి కూడా ఇంత స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదు. ఆమె మరణం కూడా ప్రత్యేకమే. జీవితమంతా పోరాటం చేసిన జయ... చివరకు చావుతో కూడా పోరాడి... శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆమె అంత్యక్రియలకు దేశ రాష్ట్రపతి సహా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అమ్మను చివరి సారిగా చూడాలని... తమిళనాడు నలుమూలల నుంచి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో చెన్నై అంతా జనసంద్రంగా మారింది. జయ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ... జయ ఏనాడూ వెనకడుగు వేయలేదు. ఒక పోరాట యోధురాలిగా అలుపెరుగకుండా పోరాడారు. విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. మహిళా సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం పోరాడుతున్న ఎంతో మందికి... నిరాశతో కుంగిపోతున్న ఎంతో మంది మహిళలకు జయ జీవితం ఓ గొప్ప పాఠ్యపుస్తకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

More Telugu News