: అసలు జయకేమయింది? అపోలోలో ఏం చేశారు?.. ఇక ఎప్పటికీ రహస్యమేనా?

ప్రజా జీవితంలో ఉండే నేతల జీవితాలు తెరచిన పుస్తకాల వంటివని, వారి గురించిన ప్రతి చిన్న విషయం ప్రజలకు తెలుస్తుందని అందరూ నమ్ముతుంటారు. కానీ, దక్షిణాదిన మహిళా ముఖ్యమంత్రిగా తన సత్తా చాటిన జయలలిత జీవితంలో రహస్యమెంతో! ఆమె అనారోగ్యం పాలై అపోలో ఆసుపత్రిలో చేరడం, ఆపై 74 రోజుల పాటు జరిగిన హైడ్రామా, మరణం అంతా రహస్యమే. తమిళ రాజకీయాల్లో రికార్డు సృష్టిస్తూ, అన్నాడీఎంకేను రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చిన ఏడు నెలలకే ఆమె దూరం కావడం మాత్రం ఎవరూ ఊహించనిదే. సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్‌ సమస్యలతో (ప్రజలకు తెలిసినంత వరకూ) అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి, సోమవారం, డిసెంబర్ 5న రాత్రి 11:30 గంటల సమయంలో ఆమె మరణించే వరకూ ప్రతి విషయం అత్యంత రహస్యంగానే ఉండిపోయింది. అసలామెకు ఏమయింది? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం అపోలో యాజమాన్యం, కొద్దిమంది వైద్య నిపుణులు, నెచ్చెలి శశికళకు తప్ప మరెవరికీ తెలియదు. అన్నాడీఎంకే మంత్రులు, పార్టీ పెద్దలకు కూడా తెలియదు. లేకుంటే, టీవీల్లో వార్తలు చూసి జయలలిత మరణించిందని ఖరారు చేసుకుని పార్టీ కార్యాలయం ముందు జెండాను దింపేసే నిర్ణయం తీసుకుంటారా? వీళ్లకే కాదు... జాతీయ స్థాయి నేతలకూ ఆమె ఆరోగ్యం, పరిస్థితిపై సరైన సమాచారం తెలియదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడైనా, గవర్నర్ విద్యాసాగర్ రావైనా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయినా... అపోలో వైద్యుల రహస్యం ముందు ఒకటే. రాహుల్ గాంధీకి కూడా అమ్మను చూపించలేదు. సరైన సమాచారాన్ని ఎన్నడూ ప్రజలకు చెప్పలేదు. ఆమె కోలుకున్నారని, మాట్లాడుతున్నారని, స్వయంగా తింటున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్లవచ్చని, ప్రకటనలు చేశారే తప్ప, ఆమె వీడియోను, కనీసం ఫోటోలను కూడా విడుదల చేయలేదు. ఇంత రహస్యం ఎందుకు పాటించారన్న ప్రశ్నకు ఇక సమాధానం కూడా అక్కర్లేదేమో. పదకొండు కోట్ల మంది తన బిడ్డలను వదిలేసి వెళ్లిపోయిన తరువాత, అందుకు కారణాలు వెతికి పట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారా? అందువల్ల ఆమె మరణ కారణం, చివరి దశలో ఆమెకు జరిగిన చికిత్సా వివరాలు సైతం రహస్యంగానే మిగిలిపోవచ్చేమో!

More Telugu News