: జయలలితకు కడసారి వీడ్కోలు పలకడానికి వెళుతున్నాను: చ‌ంద్ర‌బాబు నాయుడు

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి పట్ల ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో స‌హా అంద‌రు రాష్ట్ర‌ మంత్రులూ ఈ రోజు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. ఆమె మృతి ప‌ట్ల‌ ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఆమె మృతి దేశంలో ప్ర‌తి ఒక్కరికి షాక్ లాంటిదని అన్నారు. అన్ని పోరాటాల్లోనూ ఆమె విజ‌యాన్ని సాధించారని తెలిపారు. 75 రోజులు మృత్యువుతో పోరాటంచేసి మ‌ర‌ణించ‌డం చాలా బాధేస్తోంద‌ని అన్నారు. కొంత‌మంది నాయ‌కులే ప్ర‌జ‌ల గుండెల్లో ఉంటారని, అటువంటి వ్య‌క్తే జ‌య‌ల‌లిత అని అన్నారు. ఆమెకు ఏపీతో మంచి సంబంధాలున్నాయ‌ని, ఎన్టీఆర్ తో హీరోయిన్‌గా కూడా న‌టించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తెలుగు దేశం పార్టీ అన్నా, ఎన్టీఆర్ అన్నా ఆమె అభిమానం క‌న‌బ‌రిచేవార‌ని అన్నారు. తానంటే కూడా జ‌య‌ల‌లిత‌కు ఓ ఆప్యాయ‌త ఉండేదని చెప్పారు. స‌మ‌స్య‌ల‌పై పోరాటంలోనే కాకుండా మాన‌వ‌త్వంలోనూ ఆమె ముందుంటారని, ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టి పేద‌ల మ‌న‌సులను గెలుచుకున్నారని ఆయ‌న అన్నారు. త‌మిళ‌నాడుకు వ‌ర‌స‌గా రెండోసారి కూడా ఎన్నిక‌ల్లో గెలుపొందడం ఆమెకు సాధ్య‌మైంద‌ని చెప్పారు. మంచి నాయ‌కురాలిని దేశం కోల్పోయిందని, ఆమె చేసిన ప‌నుల‌ని దేశం యావ‌త్తు గుర్తు చేసుకుంటోంద‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఈ రోజు సంతాప దినంగా ప్ర‌క‌టిస్తున్నామ‌ని అన్నారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు. తాను కూడా త‌మిళ‌నాడుకు వెళుతున్నానని, జ‌య‌ల‌లిత‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లుకుతాన‌ని అన్నారు. ఆవిడ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆ ఆశ‌యాలు ముందుకు తీసుకుపోవ‌డం కోసం అంద‌రూ ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నట్లు తెలిపారు.

More Telugu News